USA: జగన్ రెడ్డి పాలన చూసి విదేశాల్లో వెక్కిరిస్తున్నారు: రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

ABN , First Publish Date - 2022-11-24T17:59:22+05:30 IST

వాషింగ్టన్ డీసీలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు.. ఏపీ సీఎం జగన్ పరిపాలనపై విమర్శలు చేశారు.

USA: జగన్ రెడ్డి పాలన చూసి విదేశాల్లో వెక్కిరిస్తున్నారు: రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

జగన్ రెడ్డి(AP CM Jaganmohan Reddy) పాలన చూసి విదేశాల్లో వెక్కిరిస్తున్నారని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. వాషింగ్టన్ డీసీలో తానా(TANA) పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ(TDP) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” కార్యక్రమాన్ని అమెరికాలో కూడా చేపట్టాలని పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువారంటే దేశంలోనే కాదు అమెరికాలో కూడా గౌరవం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి అత్యాశతో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారి ప్రపంచవ్యాప్తంగా పరువుపోవడం ఖర్మ కాక మరేమిటి అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారని, ఇక రేపటి నుంచి ప్రైవేటు ఆస్తులను దోచుకుంటారని అన్నారు. ప్రవాసాంధ్రులు అప్రమత్తం కాకపోతే రాష్ట్రంలో ఇక ఏమీ మిగలదన్నారు. ఆదాయం లేకుండా చేసి ఆస్తులను తెగనమ్మేవాడు ముఖ్యమంత్రి కావడం ఇదే ఖర్మ అని అన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి సభలకు బలవంతంగా తీసుకువచ్చిన ప్రజలు ఊకదంపుడు విన్యాసాలు వినలేక ఇదేం ఖర్మ అంటూ బారికేడ్లు దూకి పారిపోతున్నారన్నారు. రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్తుకు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశమని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మినహా మరోదారి లేదని తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి అధికారంలో కొనసాగినంత కాలం రాష్ట్రం బాగుపడే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి తన కల్తీ మద్యం వ్యాపారాన్ని ఏపీ నుంచి ఢిల్లీకి విస్తరింపజేశారన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కుటుంబసమేతంగా ఇరుక్కుని తెలుగువారి పరువు తీయడం రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని అన్నారు.

సతీష్ వేమన మాట్లాడుతూ.. ప్రజలు తమకు తాత్కాలికంగా వచ్చే లబ్ధి గురించి ఆలోచించడం కంటే తమ బిడ్డల దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. పాలన చేతగాక ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని ప్రజలు విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాను మాగులూరి, కిషోర్ కంచర్ల, యాష్ బద్దులూరి, రమేష్ అవిర్నేని తదితరులు పాల్గొన్నారు.

1.jpg2.jpg

Updated Date - 2022-11-24T18:06:18+05:30 IST