ఎలుకల సాయం!

ABN , First Publish Date - 2022-08-17T07:13:05+05:30 IST

అనగనగా ఒక అడవిలో ఓ పావురాల గుంపు ఉండేది. అవి మొత్తం ఎనిమిది పావురాలు. వాటి పరిసరాల్లో ఆహారం దొరకలేదు. దీంతో అవన్నీ దూరంగా వెళ్లాలని

ఎలుకల సాయం!

అనగనగా ఒక అడవిలో ఓ పావురాల గుంపు ఉండేది. అవి మొత్తం ఎనిమిది పావురాలు. వాటి పరిసరాల్లో ఆహారం దొరకలేదు. దీంతో అవన్నీ దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. గాల్లోకి ఎగిరాయి. పచ్చని పంట పొలాలవైపు వెళ్దామని పావురం రాజు మిగతా వాటికి చెప్పింది. అన్నీ గుంపుగా వెళ్తోంటే జొన్న చేను కనిపించింది. తిందామని వేగంగా పంట పొలంపై వాలాయి. అన్నీ అలా వాలాయో లేదో ఓ వలలో ఇరుక్కుపోయాయి. ‘ఇదంతా వేటగాళ్ల పన్నాగమే.


భయపడకండి’ అంటూ పావురం రాజు మిగతా పావురాలకు ధైర్యం చెప్పింది. ‘ఒక్కసారిగా మనం ఆకాశంలోకి గట్టిగా ఎగురుదాం. మీ రెక్కల శక్తి తడాఖా చూపించండి’ అన్నది. అన్నీ గాల్లోకి ఒకే సారి కలిసి కట్టుగా ఎగిరాయి. ఆ చిన్న వల పోయిందే అనే బాధకంటే.. పావురాలు ఇంత తెలివైనవా అని ఆశ్చర్యపోయాడు వేటగాడు. ‘అయ్యో నా వల’ అంటూ పరిగెత్తాడు. పావురాలన్నీ వేగంగా వలతో సహా గాల్లో దూరంగా కనిపించకుండా పోయాయి.

‘ఎలుక రాజు ఇంటికి వెళ్దాం. నేను చెబుతా’ అంటూ పావురం రాజు చెబుతూనే.. ‘సరే’ అన్నాయి మిగతా పావురాలు. రెక్కలు కొట్టడం కష్టంగా ఉంది రాజా- అంటూ ఇబ్బంది పడుతూనే ముందుకెళ్లాయి. సరిగ్గా ఎలుకరాజు సామ్రాజ్యానికి వెళ్లాయి. ఆ చప్పుళ్లు విని ఎలుకలన్నీ బొరియల్లో దాక్కున్నాయి. ‘ఎలుక రాజా. నువ్వే మా దిక్కు’ అనే పావురాల మాటలు విని ఎలుక రాజా బయటికి వచ్చింది. ‘అయ్యో.. మిత్రులారా! మీకెన్ని కష్టాలు’ అంటూ నిట్టూర్చింది. పావురాల గుంపు దిగిందో లేదో.. ఎలుక రాజా ఆజ్ఞతో చిట్టెలుకలు బొరియల్లోంచి వచ్చి వలను కొరికేశాయి. రెక్కలు విదుల్చుకుని పావురాలు సంబరపడ్డాయి. ఎలుకరాజాకి ధన్యవాదాలు చెప్పాయి. ‘మీ సాయం ఎప్పటికీ మరువలేమ’ని చెబుతూ.. ఇంటికి బయలుదేరాయి పావురాలు. ఎలుకలన్నీ వీడ్కోలు చెప్పాయి.

Updated Date - 2022-08-17T07:13:05+05:30 IST