అలా.. నక్క ‘రాజు’అయ్యింది!

ABN , First Publish Date - 2022-07-29T07:32:34+05:30 IST

అనగనగా ఓ దట్టమైన అడవి. కొండల మధ్యలో అడవి ఉంది. ఆ అడవికి ‘సింహం’ రాజుగా ఉండేది.

అలా.. నక్క ‘రాజు’అయ్యింది!

నగనగా ఓ దట్టమైన అడవి. కొండల మధ్యలో అడవి ఉంది. ఆ అడవికి ‘సింహం’ రాజుగా ఉండేది. వేటకెళ్లి తన తిండి సంపాదించుకునేది. అయితే ఏనాడూ సోమరిగా ఉండలేదు. ఎవరైనా తప్పు చేస్తే మందలించేది. అడవి నిబంధనలు పాటించకపోతే వారిని కఠినంగా శిక్షించేది. ఒక రోజు ఆ సింహానికి కుందేళ్లను తినాలనిపించింది. వేటకు బయలుదేరింది. ఓ కుందేళ్ల గుంపు కనపడింది. వాటిని వేటాడుతుంటే.. ఒక్కటీ దొరకలేదు. పైగా ఆయాసం వచ్చింది సింహానికి. ఓ బలిష్టమైన కుందేలును చూసి వేగంగా పరిగెత్తింది సింహం. అది కొండపైకి ఎక్కింది. దాన్ని తరుముకుంటూ వెళ్లింది సింహం. కొండవాలులో పొరపాటున కాలుజారి ఆ సింహం కిందపడింది. తలపగిలి చచ్చిపోయింది. ఈ విషయం అడవికంతా తెలిసింది.

ఉదయాన్నే అన్ని జంతువులూ సమావేశమయ్యాయి. ఎవరు రాజవుతారనేది ప్రశ్న. ఏనుగు, పులి, కంచరగాడిద, నక్క మాత్రం ఎవరికివారు ‘రాజు’ను అవుతామని అనుకున్నారు. అప్పుడే ఓ ఏనుగు ముందుకొచ్చింది. ‘సింహం లేకపోతే.. ఈ అడవి జంతువులను సంహరించటం సులువు’ అని కొందరు వేటగాళ్లు మాట్లాడుకోవటం విన్నా. సింహం ఉన్నా లేకున్నా మన అడవి ఒకే తీరుగా ఉండాలి. సింహం లేదనే విషయం రహస్యంగా ఉండాలి అనుకున్నారంతా. అందరూ తల ఊపారు. ఇంతలో మరి అడవికి రాజు ఉండాలి కదా? అన్నారు. వెంటనే ఎలుగుబంటి ముందుకు వచ్చి అడవికి రాజు నక్కబావ అయితే బావుంటుంది అన్నది. కొందరు జిత్తుల మారి నక్క అన్నారు. ‘కాసేపు ఆగండి’ అంటూ నక్క మాట్లాడింది. ‘నేను జిత్తులమారి అని సమాజం ఆడిపోసుకుంటుంది. పదే పదే అనటం వల్ల ఇలాంటి చెడ్డపేరు వచ్చింది. తెలివి లేకుంటే ఈ అడవిని ఏలటం కష్టం. నాకున్న తెలివి తేటలన్నీ ఉపయోగిస్తాన’ంది. వెంటనే పులి కల్పించుకుని.. ‘మరి అయితే నేనెందుకు ఉన్నా’ అనడిగింది. ‘నువ్వు గాండ్రిస్తూ ఉండు. మిగతా కథంతా నేను చూస్తా. ఈ అడవిని కాపాడే బాధ్యత నాది’ అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఇపుడు కావాల్సింది అడవికి ‘తెలివైన నక్కరాజే’ అన్నది ఏనుగు. అందరూ ఏనుగు మాటలకు వంతపాడారు.

Updated Date - 2022-07-29T07:32:34+05:30 IST