జిత్తులమారి నక్క!

ABN , First Publish Date - 2022-08-02T10:37:35+05:30 IST

ఒక అడవిలో పేద్ద గుహ. ఆ గుహలో సింహం ఉండేది. ఆ సింహానికి ఆకలైతే చాలు.. ఓ నక్క అడవిలోకి వెళ్లి మాయమాటలు చెప్పి కుందేలు, దుప్పి, జింక, జీబ్రా, దున్న.. ఇలా ప్రతిసారీ ఆ గుహ దగ్గరకు తనతో పాటు మాట్లాడుతూ..

జిత్తులమారి నక్క!

ఒక అడవిలో పేద్ద గుహ. ఆ గుహలో సింహం ఉండేది. ఆ సింహానికి ఆకలైతే చాలు.. ఓ నక్క అడవిలోకి వెళ్లి మాయమాటలు చెప్పి కుందేలు, దుప్పి, జింక, జీబ్రా, దున్న.. ఇలా ప్రతిసారీ ఆ గుహ దగ్గరకు తనతో పాటు మాట్లాడుతూ తీసుకెళ్లేది నక్క. ఆ జంతువులన్నీ నక్క మాటలను నమ్మి సింహం బారినపడేవి. సింహం తినగా మిగిలిన ఆహారాన్ని నక్క కడుపు నిండా భోంచేసేది. అసలు ఆ గుహ దగ్గరకు ఇతర జంతువులను తీసుకురావటానికి నక్క చెప్పే మాటలు వెన్న పూసినట్లు ఉండేవి. ఆ మాటలు విని చాలా జంతువులు నిజమే అని ఇట్లే నమ్మేవి. అలా నమ్మక ద్రోహంతో.. నక్కే దగ్గరుండి ప్రాణం తీయించేది. ఒక రోజు ఈ తతంగం అంతా దగ్గరగా చూసిన ఓ కాకి ..అడవంతా ఈ విషయాన్ని చెప్పింది. మోసపు నక్క కథ అన్ని జంతువులకూ తెలిసింది. అయితే ఈ విషయం నక్కకు తెలీదు.


ఒకరోజు ఉదయాన్నే నక్క అడవిలో ఈల వేసుకుంటూ చెంగుచెంగుమని ఎగురుతూ వెళ్తోంది. ఇంతలోనే ఓ బలిష్టమైన అడవి గేదె దూడ కనిపించింది. ఆ దూడ మాంసం ఎంత రుచిగా ఉంటుందో అని నక్క మనసులో అనుకుంది. గేదె దూడ దగ్గరకు వెళ్లింది. ‘పిచ్చి దూడా.. దగ్గరలో ఓ గుహ ఉంది. అక్కడ మీ జాతి చాలా ఉంది. వెళ్దాం పద’ అంటూ చెప్పింది. నక్క మాటలు నమ్మద్దని తన మిత్రుడు కాకి చెప్పిన విషయం గుర్తొచ్చింది దూడకు. ‘నక్కబావా.. నీకో విషయం తెలుసా. తెల్లగా, అందంగా, పెద్ద కుందేళ్లు ఇక్కడకి రెండు మైళ్ల దూరంలోని పొదల దగ్గర చూశా’ అన్నది గేదె దూడ. ‘ఆ కుందేళ్లను చూద్దాం పద’ అన్నది నక్క. గేదె దూడ నక్కను పొదల్లోకి తీసుకెళ్లింది. పొదల చుట్టూ.. అడవి దున్నలు, ఏనుగులు, దుప్పులు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. నక్కను కొమ్ములతో దున్నలు కుమ్మాయి. మిగతా జంతువులూ నక్కను క్షమించలేదు. అక్కడిక్కడే నెత్తురు కక్కుకుని నక్క చచ్చిపోయింది. ఆ తర్వాత జంతువులన్నీ హాయిగా జీవించాయి. 

Updated Date - 2022-08-02T10:37:35+05:30 IST