అల్లరి కోతి- అల్లరి పిల్ల
ABN , First Publish Date - 2022-10-11T09:43:38+05:30 IST
ఒక ఊరికి దగ్గరగా అడవి ఉండేది. ఆ అడవిలో ఓ కోతుల మంద ఉండేది. ఓ కోతి పొరబాటున తప్పిపోయి ఊరిలోకి వచ్చింది.
ఒక ఊరికి దగ్గరగా అడవి ఉండేది. ఆ అడవిలో ఓ కోతుల మంద ఉండేది. ఓ కోతి పొరబాటున తప్పిపోయి ఊరిలోకి వచ్చింది. ఆ కోతి చేష్టలు పిల్లలకు భలే నచ్చాయి. ఎవరినీ కరవటం, దాడి చేయటం చేయకపోవటంతో మంచి కోతి అనుకున్నారు. అయితతే ఆ కోతి అల్లరి. ఎంత అల్లరంటే.. మామిడి పండ్లయినా, పూలమొక్కలైనా.. అన్నీ తుంచి వేస్తుంది. పిల్లలు డ్యాన్స్ వేస్తే డ్యాన్సులేస్తుంది. అరటిపండు ఇస్తే తిని కామెడీ చేస్తుంది. దీంతో వీధిలోని పిల్లలంతా.. ఆ కోతి దగ్గరే మూగేవారు. అన్నం తినకుండా కోతి ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలు గుంపు ఉండేది. దీంతో కోతి గురించి ఊరంతా తెలిసింది. ఆ కోతి దగ్గరకు వెళ్లి దానిని చూపిస్తూ అమ్మలు తమ పిల్లలకు అన్నం తినిపించేవాళ్లు. ప్రతి ఇంటికీ దాదాపు కోతి పరిచయం అయింది. ఊరంతా వేడుకగా ఉండేది పగటిపూట. పిల్లలు సెలవుదినాల్లో కోతి వెంటే ఉండేవాళ్లు.
ఆ ఊరిలో ప్రియాంక అనే ఓ అల్లరిపిల్ల ఉండేది. ఆరో తరగతి చదివేది. తన అల్లరి చేష్టలకు ఇంట్లో వాళ్లు భయపెట్టేవాళ్లు. ఇళ్లంతా పీకి పందిరేసేది. ప్రతిదీ రిపేర్ చేసేది. మామిడి పండు తెంపమంటే.. వంద మామిడిపండ్లను రాళ్లతో కొట్టే బాపతు. ఒక రోజు తన తాతయ్య ఉదయాన్నే నిద్రలేచి.. పత్రిక చదువుతూ కళ్లద్దాలు పక్కనపెట్టాడు. వేపచెట్టు మీద ఉండే కోతి క్షణాల్లో ఆ కంటి అద్దాలను తీసుకెళ్లింది. పైగా చెట్టు ఎక్కి కళ్లద్దాలతో ఫోజు కొట్టింది. తాతయ్య తన మనమరాలిని పిలిచాడు. ఆ అల్లరిపిల్ల వచ్చింది. విషయం తెలుసుకుని.. తలపైకెత్తితే కళ్లద్దాలతో కోతి దర్జాగా చెట్టుమీద కూర్చుంది. క్షణాల్లో తన ప్లాస్టిక్ కళ్లద్దాలను తీసుకుని పెట్టుకుంది. కోతిని చూసింది. కోతి తనవైపు చూసింది. కళ్లద్దాలు పలుసార్లు తీసేసి మళ్లీ ఽపెట్టుకుంది. కోతి కూడా అలానే చేసింది. కొద్ది సేపయ్యాక తన కళ్లద్దాలను గడ్డిలోకి విసిరేసింది అల్లరిపిల్ల. కోతి కూడా అలానే గడ్డిలోకి కళ్లద్దాలను విసిరేసింది. వెంటనే కళ్లద్దాలు తీసుకుని తన తాతయ్యకు ఇచ్చింది. ఎంతో సంతోషంతో తాతయ్య కళ్లద్దాలను ధరించాడు. బావుంది.. ఈ అల్లరిపిల్ల- అల్లరి కోతి చేష్టలు అన్నాడు.. నవ్వుతూ!