మాయా కప్ప!

ABN , First Publish Date - 2022-10-05T09:58:26+05:30 IST

ఒక అడవిలోని కొలను దగ్గర ఉండే చెట్టును అంటిపెట్టుకుని ఓ పెద్దముక్కు కొంగ, ఆ కొలను దగ్గర కప్ప ఉండేది.

మాయా కప్ప!

ఒక అడవిలోని కొలను దగ్గర ఉండే చెట్టును అంటిపెట్టుకుని ఓ పెద్దముక్కు కొంగ, ఆ కొలను దగ్గర కప్ప ఉండేది. ఇరుగు పొరుగువాళ్లు కావటంతో ఇద్దరూ పరిచయమయ్యారు. ఆ తర్వాత స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి తిరిగేవాళ్లు. ఒక రోజు అడవిలో ఉండే నక్కకు ఓ కప్పను తినాలనే ఆశపుట్టింది. అది కూడా ఆకుపచ్చ కప్ప తినాలనుకుంది. ఇలాంటి కోరిక పుట్టడానికి కారణం.. ‘ఆకుపచ్చ కప్ప తింటే ఈ అడవికి నువ్వే రాజువి’ అని ఓ రామచిలుక జ్యోతిష్యం చెప్పిందట. ఆ రోజునుంచి ఆకుపచ్చ కప్ప తినాలని ఎదురుచూస్తోంది. ఆకుపచ్చ కప్పకోసం ఆరాతీస్తూంటే.. అడవికి తూర్పు వైపున ఉండే ఓ కొలనులో పచ్చకప్ప చూశానని ఓ పావురం చెప్పింది. నక్క ఆలోచించింది. తన పాత మిత్రుడైన ఎర్రమూతి కోతిని ఆ కొలను దగ్గరకు పంపింది. ఎలాగైనా ఆకుపచ్చ కప్ప తీసుకురమ్మని చెప్పింది. ఆ కోతికి కూడా భయాలెక్కువ. 


కోతి చెట్లు మీద ఎగురుకుంటూ కొలను దగ్గర చెట్టు దగ్గరకు చేరుకుంది. అక్కడ పెద్ద ముక్కు కొంగ కనిపించింది ఆ కోతికి. ప్రాణం లేచొచ్చింది. ‘మిత్రమా ఈ కొలను దగ్గర ఓ ఆకుపచ్చ కప్ప ఉందట’కదా అని అడిగింది కొంగను. ‘అవును’ అంది. ‘నీకు తెలుసా?’ అని ఆశ్చర్యంగా అడిగింది కోతి. కప్పకోసం వచ్చారా అనడిగింది కొంగ. ‘అవును.. మా నక్కగారికి కావాలి. ఎంత కష్టమైనా ఆ కప్పను పట్టుకురా’ అన్నారన్నది కోతి. కొంగకు విషయం అర్థమైంది. ‘అదిగో కప్ప. దానికి మాటలు రావు. ఆ కప్పను హింసిస్తే మీ వానరజాతి సమూలంగా నాశనం అవుతుంది’ అన్నది. కోతి భయంతో వణికింది. ‘చూడు.. మీరెవరో తెలీదు. అది మాయా కప్ప. ఆకుపచ్చ రంగు ఎలా వచ్చిందో తెలీదు. నిలువెల్లా విషమే. ఆ కప్పను తిని మీ నక్కగారు చనిపోతే.. ఆ నింద నీ మీదకు వస్తుంది. అప్పుడు నిన్నే చంపేస్తారన్నది కొంగ. అదే క్షణంలో ఆ కప్ప ఓ ఆకుపై కనపడింది. ‘కోతిగారూ.. అటు చూడండి’ అన్నది. నిజంగానే ఇది మాయాకప్పని భయపడింది. లేకుంటే ఆకుమీద ఎలా నిలబడుతుందని సందేహం వచ్చింది. ‘మా ప్రాణాలు కాపాడారు’ అంటూ కొంగకు ధన్యవాదాలు చెబుతూ వచ్చిన దారింటే వెళ్లిపోయింది కోతి.   ఇదంతా చెప్పుకుని నవ్వుకున్నారు ఇద్దరు స్నేహితులు. 

Read more