new sibling: రెండో బిడ్డ పుట్టబోతుందా..? తోబుట్టువు కోసం మీ మొదటి బిడ్డను ఎలా సిద్ధం చేస్తున్నారు..?
ABN , First Publish Date - 2022-11-03T14:33:23+05:30 IST
శిశువు తాకేందుకు ఇష్టపడుతున్న పిల్లల్ని నెమ్మదిగా దగ్గరకు తీసుకుని పట్టుకునేలా చూడండి.
కుటుంబంలోకి కొత్త సభ్యులు రాబోతున్నారనే వార్త చాలా ఆనందకరమైనది. మిగతావారిలో ఉత్సాహాన్ని నింపే వార్తే. కొత్తగా రాబోతున్న బిడ్డను కుటుంబం మొత్తం శ్రద్ధగా చూసుకోవాలి. అదే సమయంలో పెద్ద పిల్లలను చూసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే రాబోతున్న తమ చెల్లి, తమ్ముడు కోసం మీ మొదటి బిడ్డను ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం.
అప్పటివరకూ మొదటి బిడ్డ ఆటపాటలతో ఇల్లంతా సందడిగా మారి సంతోషాలు నిండి ఉంటాయి. ఆ బిడ్డ మురిపాలతో మనసుల్లో ఆనందం పండి ఉంటుంది. తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మలకు గారాల కూనగా పెరుగుతున్న బిడ్డ. ఇంకొకరు ప్రేమను తనతో సమంగా పంచుకోవడానికి రాబోతున్నారంటే అది అర్థం చేసుకునే వయసు వారికి ఉండదు. తనకో చెల్లెలో, తమ్ముడో రాబోతున్నాడనే సంగతి తల్లిదండ్రులే చెప్పాలి. ఇప్పుడే పిల్లలు తోబుట్టువుల మీద అసూయను పెంచుకుంటూ ఉంటారు. తల్లితండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు.
పిల్లలకు అసూయ పడే అవకాశం ఇవ్వకూడదంటే తల్లి తన గర్భం గురించి పిల్లలకు అర్థం అయ్యే భాషలో చెప్పాలి. కొన్ని సందర్భాలలో వాళ్లకు పుట్టిన పిల్లల పనులు అప్పగించాలి. అదెలాగంటే..
1. బొమ్మ సహాయంతో శిశువును ఎలా పట్టుకోవాలి, ఎలా తాకాలి అనేది మాట్లాడుతూ చూపించాలి. పాపాయిని పట్టుకోవడం చేతులతో తాకడం గురించి ఆటలా వాళ్ళతో ఆడాలి. ఇది రాబోతున్న బిడ్డ మీద పిల్లలకు శ్రద్ధను, ఆసక్తిని కలిగిస్తుంది.
2. కుటుంబంలో కొత్తగా బిడ్డను తీసుకువచ్చేందుకు సన్నాహాల్లో భాగంగా ఇద్దరు బిడ్డల తరువాత సంసారం ఎలా ఉండబోతుంది అనే దానిమీద పుస్తకాలు చదవండి.
3. వాళ్ళతో ఇంకో బిడ్డ వచ్చినా నువ్వు నా గారాల బిడ్డగానే ఉంటావనే విషయాన్ని చెపుతూ ఉండండి. నేను ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పండి. మీ బిడ్డకు అప్పుడు నమ్మడం మొదలు పెడుతుంది. కొత్తగా రాబోతున్న బిడ్డ తన తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమను తన నుంచి తీసుకుపోరని నమ్ముతుంది.
4. పుట్టిన బిడ్డకు పాలు పట్టేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు మురిపంగా ఆటలాడేటప్పుడు పెద్ద బిడ్డను కూడా కలుపుకోండి.
5. రెండో బిడ్డ పుట్టగానే మొదటి బిడ్డ పక్కను వేరుగా వేయడం దూరంగా పడుకోబెట్టడం చేయకూడదు. ఇది పిల్లల మనసును గాయపరుస్తుంది.
6. శిశువును తాకేందుకు ఇష్టపడుతున్న పిల్లల్ని నెమ్మదిగా దగ్గరకు తీసుకుని పట్టుకునేలా చూడండి. ఆడించనీయండి. ఇవన్నీ ఎదుగుతున్న పిల్లల్లో తోబుట్టువు మీద అసూయ పెరగకుండా చేస్తాయి.