కాకి చిలుకైతే..

ABN , First Publish Date - 2022-10-07T09:51:15+05:30 IST

ఒక అడవిలో చిలుక, కాకి ఉండేవి. రెండూ స్నేహితులు. తిండి కలిసి తినేవి. చెట్టుమీద కూర్చుని చిలుక తియ్యగా మాట్లాడేది.

కాకి చిలుకైతే..

క అడవిలో చిలుక, కాకి ఉండేవి. రెండూ స్నేహితులు. తిండి కలిసి తినేవి. చెట్టుమీద కూర్చుని చిలుక తియ్యగా మాట్లాడేది. వాతావరణం హాయిగా ఉంటే రాగాలు తీసేది. చిలుక పలుకులు, తియ్యని మాటలంటే మిగతా పక్షులూ, జంతువులూ ఇష్టపడేవి. అదే పనిగా చిలకను మాట్లాడమనేవి. ‘ఇది దేవుడి ఇచ్చిన అదృష్టం. మాట్లాడటం.. ధ్వనిని మిమిక్రీలా చేయటం నాకే కొత్తగా అనిపిస్తుంది’ అని మనసులో చాలాసార్లు అనుకుంది చిలుక.


చిలకపచ్చ రంగు, ఎర్రటి ముక్కు, తియ్యని మాటలు.. ఇంతకంటే ఏం కావాలి? చిలుకను ఇష్టపడటానికి. చిలుకకు ఫాలోయింగ్‌ రావటంతో, ఫ్యాన్స్‌ ఎక్కువ ఉండటంతో లోలోపలే కాకి కుళ్లుకునేది. తనుకూడా బాగా పాడతానని ‘కావ్‌ కావ్‌’ అంటూ అందరినీ విసిగించేది. ఒక రోజు వేటగాడు వేసిన వలలో చిలుక చిక్కుకుంది. పాపం.. చిలుక విలవిల్లాడింది. కాకిని పిలిచింది. కాకి చెట్టు చాటున దాక్కుని పలకలేదు.. ఉలకలేదు. చిలుకను వేటగాడు తీసుకెళ్లి ఓ వ్యాపారికి అమ్మాడు. ఆ వ్యాపారి ఇళ్లు కనుక్కుంది కాకి. అక్కడికెళ్లి చూస్తే విచిత్రంగా.. ఆ వ్యాపారి పిల్లలంతో చిలుకతో కాలక్షేపం చేస్తున్నారు. ఇది చూసి చిలుకలా మారాలని కాకి అనుకుంది. అనుకుందే తడవుగా రంగు వేయించుకుంది చిలుకలా. ఎర్రముక్కుగా మార్చుకుంది. కావాలనే వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. విభిన్నమైన చిలుక అనుకున్నాడు వేటగాడు. మరో వ్యాపారికి అమ్మాడు. చిలుకలానే వేషం వేసుకున్న కాకిని ఓ పంజరంలో ఉంచారు. వాళ్ల పిల్లలు ప్రతిరోజూ పంజరం దగ్గరికొస్తే.. కాకి గమ్మున ఉండేవి. కోపం వచ్చినా, సంతోషమొచ్చినా ‘కావ్‌ .. కావ్‌’ అనకుండా అలానే ఉండిపోయేది. ఒక రోజు గండుపిల్లి వచ్చి పంజరాన్ని తెరచి కాకిని పట్టుకుంది. కావ్‌కావ్‌ అని అరవలేదు. పీకపట్టుకుని కొరికింది. ఆ కాకి చచ్చిపోయింది.

Read more