ఎలుగుబంటి, చిట్టెలుక!

ABN , First Publish Date - 2022-08-05T05:30:00+05:30 IST

ఒక అడవిలో ఎలుగుబంటి ఉండేది. దానికి కొంచెం కోపం ఎక్కువ. తేనె అంటే మహా ఇష్టం. తాను తినాలనుకున్న తేనెతుట్టె జోలికి వెళ్తే దానికి కోపం తలకెక్కేది. ఆ అడవిలోకి ఓ వేటగాడు వచ్చాడు. తేనెటీగల శబ్దం విని తేనె వెతకసాగాడు.

ఎలుగుబంటి, చిట్టెలుక!

ఒక అడవిలో ఎలుగుబంటి ఉండేది. దానికి కొంచెం కోపం ఎక్కువ. తేనె అంటే మహా ఇష్టం. తాను తినాలనుకున్న తేనెతుట్టె జోలికి వెళ్తే దానికి కోపం తలకెక్కేది. ఆ అడవిలోకి ఓ వేటగాడు వచ్చాడు. తేనెటీగల శబ్దం విని తేనె వెతకసాగాడు. ఓ రాయి తొర్రలో తేనీగలు కదలాడుతున్నాయి. పొగబెట్టి తేనెటీగలను తరిమేసి తినేయాలని అనుకున్నాడు. నిప్పుకోసం రెండు రాళ్లు తీసుకొచ్చాడు. అంతలోనే చిట్టెలుక అక్కడికి వచ్చింది. ‘ఎవరు స్వామి నువ్వు’ అనడిగింది. ‘నేను.. వేటగాడ్ని. పులిని సైతం వేటాడే సత్తా నాది. ఈ ప్రాంతంలోని తేనె రుచిగా ఉంటుందని ఎవరో మాట్లాడుకుంటుంటే ఇటొచ్చా’ అన్నాడు వేటగాడు.


‘వేటగాడా.. దయచేసి ఆ రాయి తొర్రలో తేనెను కదపకండి. అది నా స్నేహితుడిది’ అన్నది చిట్టెలుక. ‘అయితే.. నేనేం చేయాలి. తేనె ఎవరి సొత్తు కాదు’ అన్నాడు. ‘ఎక్కడో ఉండే నువ్వు.. ఈ రాయి తొర్రలో ఉండే తేనెమీద పేరు రాయలేదు కదా. మా మిత్రుడు అసలే కోపిష్టి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు. ఈ లోపు నువ్వు వచ్చి తేనెను తీసుకుపోతే ఎలా?’ అన్నది చిట్టెలుక. కోపంతో చిట్టెలుకను రాయితో కొట్టాడు. తప్పించుకుంది. ఇంతలోనే వేటగాడు, చిట్టెలుక వాదులాడుతుంటే చూశానంటూ ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి ఓ పావురం సమాచారం అందించింది. ఎలుగుబంటి పరిగెత్తుతూ తేనెతుట్టె దగ్గరకు వచ్చింది. వేటగాడు పొగబెట్టాడు. తేనెటీగలు కుడుతుంటే.. దూరంగా పరిగెత్తాడు. ఇదే అదను అనుకుని రాయి దగ్గరకు వెళ్లి ఒక్క ఉదుటున ఎలుగుబంటి తేనెతుట్టెను లాక్కొని పరిగెత్తింది.


వేటగాడు బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇంతలోనే వేటగాడి కాలిని చిట్టెలుక గట్టిగా కొరికింది. గురితప్పింది. కోపంతో చిట్టెలుకను కాలితో రక్కాలని ప్రయత్నించి కిందపడ్డాడు. ఈ లోపు చిట్టెలుక తప్పించుకుంది. ఎలుగుబంటి తేనెతుట్టెను ఒక రాయిమీద ఉంచి వేగంగా వేటగాడి మీదకు దూకింది. గోళ్లతో రక్కింది. వేటగాడు బతుకుజీవుడా అనుకుంటూ పారిపోయాడు. ఆ తర్వాత ఎలుగుబంటి, ఎలుక తేనెను తిన్నాయి. 

Updated Date - 2022-08-05T05:30:00+05:30 IST