కాకి కోపం!

ABN , First Publish Date - 2022-12-31T03:40:16+05:30 IST

ఒక అడవిలో రిన్నీ అనే కుందేలు, పెన్నీ అనే ఎలుక ఉండేవి. వాటికి చదువంటే ఇష్టం.

కాకి కోపం!

క అడవిలో రిన్నీ అనే కుందేలు, పెన్నీ అనే ఎలుక ఉండేవి. వాటికి చదువంటే ఇష్టం. ఒక రోజు బడికి వెళ్లి వస్తుంటే.. చెట్టుమీద కాకి కనపడింది. దాని పేరు సన్నీ. కావాలనే రిన్నీ కుందేలు కాకిని ఆటపట్టించాలనుకుంది. ‘మా లాంటి విద్యార్థులకే తెలివి ఎక్కువ ఉంటుంది. మీలాంటి వాటికి మెదడు ఉండదు’ అన్నది. కాకికి కోపం వచ్చింది. ‘చూడు.. పిల్లలూ. మీరు తెలివి లేని వాళ్లు. మీకో విషయం తెలుసా.. మా తాతగారు అప్పట్లో తెలివైనవాళ్లు. కుండలో నీళ్లు పైకి రాకపోతే రాళ్లు వేసి.. పైకి వచ్చాక తాగారట. అదీ తెలివంటే. మేము పుట్టుకతోనే తెలివైన వాళ్లం. కాకుల తెలివి ఎవరికి ఉంటుంది.. అన్నది. రిన్నీ కుందేలు.. ఖంగుతిన్నది. ‘ఏదేమైనా చెప్పు చదువుకున్న వాళ్లకంటే.. చదువు లేని వాళ్లకు చెప్పటం కష్టం. సులువుగా మోసపోతారు’ అన్నది పెన్నీ ఎలుక. కోపంతో రివ్వున కాకి ఎగిరిపోయింది.

కొన్నాళ్లు గడిచాక.. రిన్నీ, పెన్నీలు అడవిలోకి వచ్చాయి తిండి కోసం. బాగా ఆడుకున్నాయి. తిండి దొరకలేదు. అయితే నీళ్లు దప్పికగా ఉన్నాయని రిన్నీ కుందేలు తన మిత్రుడితో చెప్పింది. పెన్నీ ఎలుక దగ్గరలో ఉండే ఒక కుంటను చూసింది. అది లోతట్టులో ఉంది. దాంట్లోకి పడిపోతే అంతే సంగతులు అనుకుంది పెన్నీ. అంతలోనే రిన్నీ కుందేలుకు చటుక్కున ఆలోచన వచ్చింది. ‘డియర్‌ పెన్నీ.. మనకు తెలిసిన సన్నీ కాకి ఉంది కదా దగ్గరలో. దాని దగ్గరకు వెళ్దాం’ అన్నది. ఇద్దరు మిత్రులూ కాకి దగ్గరకు వెళ్లారు. కాకి కోపంగా ఉంది. ‘చదువుకున్న వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చారో’ అన్నది. విషయం చెప్పారు. ‘ముందే చెప్పా కదా.. మా తాతయ్యలు తెలివైనవాళ్లు. నా తెలివిని గ్రహించి ఇక్కడికొచ్చారు మీరు’ అన్నది. కుంట దగ్గరకు పోయారు. ఆ నీళ్లను చూసి ఆ ఇద్దరు పిల్లలతో ఇలా అంది.. ‘పిల్లలూ ..

నేను రాళ్లను తీసుకొస్తా. మీరు కట్టెపుల్లలు వేయండి. పెద్ద కొమ్మలు కూడా వేయండి’ అన్నది. కాకి దూరంగా ఉండే గుట్ట మీదకు వెళ్లి రాళ్లు తీసుకొచ్చి వేస్తోంది. వంద రాళ్లు వేసింది. రిన్నీ, పెన్నీలు దుంగలు, కొమ్మలు వేసినా నీళ్లు పైకి రాలేదు. సన్నీతో రిన్నీ ఇలా అన్నది. ‘చూడు సన్నీ. వందరాళ్లను వంద రోజులు ఈ నీళ్లలో వేసినా ఉపయోగం లేదు. నీళ్లు పైకి రాకపోగా.. బురద అవుతాయి. ఇక చాలు నీ తెలివి’ అన్నది. కాకి నిజమేనని మనసులో అనుకుంది. అయితే వొప్పుకోలేదు. మాటల మధ్యలో పెన్నీ ఎలుక ఇలా అన్నది.. ‘చదువుకున్న వాళ్లకంటే చదువురాని వాళ్లు ఎప్పటికీ తక్కువే’ అన్నది. చిట్టెలుక మాటలకు కాకి హర్ట్‌ అయింది. కోప్పడింది. చేసేదేమీ లేక రివ్వున గాల్లోకి ఎగిరిపోయింది. ‘సమాధానం చెప్పకుండా కోపంగా వెళ్లిపోతే ఎలా అన్నది’ కుందేలు. ఇద్దరూ నవ్వుకున్నారు.

Updated Date - 2022-12-31T03:40:16+05:30 IST

Read more