Kids with allergies: పిల్లల్లో వచ్చే అలెర్జీలు..జాగ్రత్తలు..!

ABN , First Publish Date - 2022-10-11T20:49:56+05:30 IST

పసికందులు వ్యాధికారక సూక్ష్మక్రిములు, బాక్టీరియాతో పోరాడే రోగనిరోధక వ్యవస్థతోనే పుడతారు. కానీ వీళ్ళలో చాలామందికి బలమైన రోగనిరోధక శక్తి ఉండకపోవచ్చు.

Kids with allergies: పిల్లల్లో వచ్చే అలెర్జీలు..జాగ్రత్తలు..!

వాతావరణం మారిందంటే రకరకాల రోగాలు వ్యాపిస్తూ ఉంటాయి. అందులోనూ పిల్లల్లో అయితే విష జ్వరాలు, అలర్జీలు, జలుబు, తుమ్ములతో పాటు అలర్జీలు కూడా వచ్చి పడతాయి. కాస్త పెద్ద పిల్లలైతే ఒంట్లో ఎలా ఉందీ అని అడగ్గానే చెప్పగలుగుతారు. మరీ చిన్నవయసు పిల్లలకు వాళ్ళకు ఏమౌతుందనేది చెప్పేందుకు వీలుండదు.


మరి అలాంటి పసికందులు వ్యాధికారక సూక్ష్మక్రిములు, బాక్టీరియాతో పోరాడే రోగనిరోధక వ్యవస్థతోనే పుడతారు. కానీ వీళ్ళలో చాలామందికి బలమైన రోగనిరోధక శక్తి ఉండకపోవచ్చు. దీంతో తరచుగా అనారోగ్యాల బారిన పడతారు. ఇలా ఇమ్యునిటీ తక్కువగా ఉన్నపిల్లలను రోగాల బారిన పడకుండా తల్లితండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. 


అలర్జీలు

చర్మ అలర్జీ, ముక్కు అలర్జీ, ఆస్థమా, ఫుడ్ అలర్జీలు ఈ అలర్జీలన్నింటికీ మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి తక్షణం ఉపశమనం కలిగించే రిలీవర్లు, నియంత్రణలో ఉంచే కంట్రోలర్లతో మంచి ఫలితం కనబడుతుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు అలర్జీ లక్షణాలు తగ్గగానే మందులు మానేస్తుంటారు. దీంతో సమస్య మళ్లీ తిరగబెడుతుంది. డాక్టర్ రాసిన కోర్సు ప్రకారం మందులు వాడినట్లయితే సమస్య మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉండదు.


ఏలా వస్తాయి. 

ఈ అలెర్జీలు పెంపుడు జంతువుల నుంచి వస్తాయి. జంతువుల జుట్టు, లాలాజలం, రెట్టలు అలెర్జీని కలిగిస్తాయి. వీటికి దగ్గరగా ఉన్నప్పుడు పిల్లలు తుమ్మడం, దగ్గడం చేస్తుంటారు. అలాగే కొన్ని రకాల మొక్కలను, వస్తువులను తాకినప్పుడు దద్దుర్లు వస్తుంటాయి. దీనితో పిల్లలు అలెర్జీకి గురవుతారు. 


అలర్జీల నుంచి దూరంగా..

అలర్జీల నుంచి దూరంగా ఉండాలంటే తల్లితండ్రులు కాస్త శ్రద్ధ తీసుకోవాలి. పెంపుడు జంతువులను పిల్లలకు దూరంగా ఉంచాలి. వాటి నుంచి వచ్చే క్రిములకు పిల్లలు ఎఫెక్ట్ కాకుండా చూడాలి. వాటిని ఉంచే చోట శుభ్రతను పాటించాలి. ఇంట్లో లేదా ఇండోర్ ప్లాంట్ల వల్ల దుమ్ము పేరుకుంటుంది. కాన్ని రకాల పెర్ఫ్యూమ్స్ చికాకు తెప్పిస్తాయి. వీటిని పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలు పాకుతూ ఆడుకునే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. వాళ్ళు తాకి నోటిలో పెట్టుకునే బొమ్మలను ఏరోజుకారోజు వేడినీటిలో మరిగించి ఆరబెట్టి ఇవ్వాలి. 


ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. 

కాస్త పెద్ద పిల్లల్లో తరుచుగా వచ్చే శ్వాస ఇబ్బందుల నుంచి ఉపసమనానికి ఆహారంలో ఇంట్లో వాడే దినుసులతో కషాయాన్ని తయారు చేసి ఇవ్వడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.  వేరుశెనగలు, పాలు, గుడ్లు, గోధుమలు, సోయా, కొన్ని రకాల పండ్లు కూరగాయలు పిల్లలకు ఇచ్చే ముందు జాగ్రత్తలు పాటించాలి. కాస్త గాలి, వెలుతురు సోకే విధంగా ఇంటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. 


చేతులను కడగండి.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే సున్నితమైన పిల్లలకు అస్తమానూ చేతులు, ముఖం, నోరు, కాళ్ళను కడుగుతూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల దుస్తులను మార్చే విషయంలో కూడా సరైన పద్దతిని పాటించాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రకాల అలర్జీలనైనా దూరం చేయవచ్చు. 

Read more