పోపుల పెట్టెలోనే ఆరోగ్యం గుట్టు!
ABN , First Publish Date - 2022-06-22T17:02:05+05:30 IST
భారతీయుల వంటింటి పొపుల పెట్టెలోనే ఆరోగ్యం గుట్టు ఉందా..? సుగంధ ద్రవ్యాల(స్పైసెస్) వాడకానికి, ఇతర దేశాలతో పోలిస్తే..

సుగంధ ద్రవ్యాల వాడకంతో రోగనిరోధక శక్తి
ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో అందుకే తక్కువ కేసులు, మరణాలు?
కొవిడ్ నివారణకు అల్లం, కోలుకునేందుకు వెల్లుల్లి!
తాజా అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): భారతీయుల వంటింటి పొపుల పెట్టెలోనే ఆరోగ్యం గుట్టు ఉందా..? సుగంధ ద్రవ్యాల(స్పైసెస్) వాడకానికి, ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కొవిడ్ ప్రభావం తక్కువగా ఉండటానికి సంబంధం ఉందా..? అంటే ఉందనే అంటోంది ఓ తాజా అధ్యయనం. ముంబైలోని డీవై పాటిల్ ఆయుర్వేదిక్ డీమ్డ్ యూనివర్సిటీ, పుణెలోని భారతీయ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ ఈ విషయంలో కొవిడ్-19 మొదటి వేవ్ సమయంలో సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. తమ అధ్యయన వివరాలను జర్నల్ మెడ్ఆర్ఎక్స్ఐవీ జర్నల్లో తాజాగా ప్రచురించాయి. దాని ప్రకారం.. సుగంధ ద్రవ్యాల వినియోగంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాశ్చాత్య దేశాల్లో వాటి వాడకం తక్కువగా ఉండటంతో అక్కడ కరోనా వ్యాప్తి, మరణాల రేటు ఎక్కువగా ఉన్నాయి. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సుగంధద్రవ్యాల వాడకపు లెక్కల్ని పరిశీలించారు. వాటి ఆధారంగా కొవిడ్ వ్యాప్తి, మరణాల సరళిని పోల్చిచూశారు.
జీలకర్ర ఎక్కువగా వినియోగించిన రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా కనిపించింది. చింతపండు ఎక్కువగా వాడిన రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఇక, అల్లం కొవిడ్ నివారణకు యాంటీ-ఇన్ఫ్లమేటరీగా పనిచేసింది. అలాగే ఇమ్యూనోమాడ్యులెటరీ( శరీరంలో వైరస్ ప్రవేశించినప్పుడు రోగ నిరోధకశక్తి అతిగా స్పందించకుండా నియంత్రించడం)గా కూడా ప్రభావం చూపించింది. వెల్లుల్లి, ధనియాలు, పసుపు, నల్ల మిరియాలు కూడా ఇదే తరహాలో భారతీయులకు రక్షణ కల్పించాయి. సుగంధ ద్రవ్యాలను అధికంగా వాడిన చోట కొవిడ్ ఇన్ఫెక్షన్, మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. భారత్లో 52 రకాల సుగంధ ద్రవ్యాలు పండించడంతో పాటు వినియోగిస్తున్నారు. వీటిలో ప్రధానంగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పసుపు, నల్ల మిరియాలు, మిర్చి, చింతపండును ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటి వాడకం దేశవ్యాప్తంగా ఒక్కొచోట ఒక్కో రకంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో చింతపండు వాడకం ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలో చింతపండు వాడకం దాదాపుగా లేదు. లక్షద్వీ్పలో కరివేపాకు, యాలుకలు, లవంగాలు అత్యధికంగా వినియోగిస్తున్నారు. అక్కడ కొవిడ్ తీవ్రత తక్కువగా ఉంది. వెర్సను నివారించడంలో అల్లం, వైరస్ నుంచి కోలుకోవడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషించాయని అధ్యయనం తెలిపింది. రోగనిరోధక శక్తికి అల్లం, పసుపు శక్తిమంతమైన పరిష్కారాలని పరిశోధకులు తెలిపారు. ఇక.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లలో భారత్ కంటే ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తుండటంతో అక్కడ కొవిడ్ మరణాల భారత్ కంటే తక్కువగా కనిపించిందని అధ్యయనం స్పష్టం చేసింది.