30 లోపే మేలు!

ABN , First Publish Date - 2022-09-06T13:54:59+05:30 IST

ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటూ ఉంటారు. ఇది మాతృత్వానికీ

30 లోపే మేలు!

ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటూ ఉంటారు. ఇది మాతృత్వానికీ వర్తిస్తుంది. వేర్వేరు కారణాలతో పిల్లలను లేటు వయసులో కనడంలో దుష్ప్రయోజనాలే ఎక్కువని వైద్యులంటున్నారు. పండంటి బిడ్డల కోసం, ముప్పై ఏళ్ల లోపే గర్భం దాల్చడం మేలని సూచిస్తున్నారు. 


హిళల వయసును బట్టి వాళ్లు ఏ కారణంతో ఆస్పత్రికి వచ్చారో స్త్రీల వైద్యులు ఊహించగలిగేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పూర్వం 25 ఏళ్ల లోపు మహిళలు వైద్యులను కలిస్తే అందుకు గర్భధారణే ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే కారణంతో వైద్యులను సంప్రతించే వారిలో 45 ఏళ్లు పైబడిన మహిళలు కూడా ఉంటున్నారు. మహిళలు ఆరోగ్య కారణాలతో లేదా వ్యక్తిగత కారణాలతో ప్రెగ్నెన్సీని వాయిదా వేయడమే ఇందుకు కారణం. అయితే కెరీర్‌ కోసం కావాలనే గర్భధారణను ఆలస్యం చేయడం, లేదా ఆలస్యంగా గర్భం దాల్చే పరిస్థితులను కొని తెచ్చుకోవడం వల్ల అటు తల్లి మీదా, ఇటు బిడ్డ మీదా దుష్ప్రభావం పడే వీలుంటుంది.


వాయిదా వేయక తప్పని పరిస్థితులుఉరుకుల పరుగుల జీవితం, చదువు, వృత్తిలో పోటీతత్వాలు మహిళల్లో మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఎక్కువ సమయాల పాటు కూర్చుని చేసే ఉద్యోగాలతో, పని వేళలతో మహిళలకు వ్యాయామం కొరవడుతోంది. వీటి మూలంగా సంతానోత్పత్తికి అడ్డుపడే ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఇవన్నీ గర్భధారణకు అడ్డుపడే ఆరోగ్య సమస్యలే కాబట్టి వీటిని సరిదిద్దుకునేలోగా వయసు పైబడిపోతోంది. 


థైరాయిడ్‌: విపరీతమైన ఒత్తిడి మూలంగా హైపో లేదా హైపర్‌ థైరాయిడ్‌ సమస్యలు మొదలవుతున్నాయి. ఈ రెండు సమస్యలూ గర్భధారణకు అడ్డుపడేవే!

ఒబేసిటీ: వ్యాయామ లోపం మూలంగా చిన్న వయసులోనే మహిళలు స్థూలకాయులుగా తయారవుతున్నారు. అధిక బరువు పాలీసిస్టిక్‌ ఓవరీస్‌ మొదలైన ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 

మధుమేహం: టీనేజీ వయసులోనే మధుమేహానికి గురయ్యే మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు కారణం కూడా ఆహార, జీవనశైలి లోపాలే! 

అబార్షన్లు: కొన్ని కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్ల మూలంగా వరుసగా గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. కారణాన్ని లోతుగా పరిశీలిస్తే కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్‌ సమస్య బయటపడుతూ ఉంటుంది. ఇలా వరుస గర్భస్రావాలతో బిడ్డను కనే వయసు మించిపోతూ ఉంటుంది.

ఆహారం: వంట చేసుకునే తీరిక లేకపోవడం, అందుబాటులో ఉన్న జంక్‌ ఫుడ్‌ వల్ల ఆహారం మీద నియంత్రణ తప్పుతోంది. అవసరానికి మించిన పిండిపదార్థాలు, కొవ్వులతో అధిక బరువు సమస్య ఎక్కువవుతోంది. 


ఏ వయసు ఉత్తమం?

20, 22 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన వయసు. ఈ వయసులో నాణ్యమైన అండాలను కలిగి ఉంటారు. గర్భధారణ జరిగే అవకాశాలు కూడా ఈ వయసు మహిళలకే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పటి రోజుల్లో ఈ వయసులో పెళ్లిళ్లకు సిద్ధపడే అమ్మాయిలు చాలా తక్కువ. అయితే ఉన్నత చదువులు, కెరీర్‌ కోసం ఇంకొంత సమయాన్ని తీసుకోవాలనుకునే అమ్మాయిలు కనీసం 25 నుంచి 30, 32 ఏళ్ల లోపు తొలి బిడ్డను ప్రసవించేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఈ వయసు మహిళల్లో గర్భధారణ అవకాశాలు ప్రతి నెలలో, 25 శాతం మేరకు ఉంటాయి. ప్రసవాలకు మధ్య స్పేసింగ్‌ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవచ్చు. అయితే ఈ వయసు కూడా దాటిపోయి 35 ఏళ్లకు చేరుకునేటప్పటికి అండాల నాణ్యత తగ్గుముఖం పడుతుంది. దాంతో గర్భధారణ అవకాశాలు తగ్గి, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలను సరిదిద్దుకుని గర్భం దాల్చే సమయానికి వయసు మరింత పెరిగిపోతుంది. కాబట్టి వీలైనంత ముందుగానే 30 ఏళ్ల లోపే గర్భాన్ని ప్లాన్‌ చేసుకోవడం ఉత్తమం. 


పెళ్లయ్యాక కూడా...

కొందరు మహిళలు పెళ్లి తర్వాత గర్భధారణను మూడు నుంచి నాలుగేళ్ల పాటు వాయిదా వేసి, ఆ తర్వాత ప్రయత్నాలు మొదలుపెడతారు. ప్రతి నెలసరికీ కుంగి పోతూ, విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. దీనికి తోడు పిల్లల గురించి సన్నిహితులు, బంధువుల ఆరాలు మహిళల్లో ఒత్తిడిని మరింత పెంచేస్తాయి. ఈ ఒత్తిడి ప్రభావం కూడా గర్భధారణకు అడ్డంకిగా మారుతుంది. ఇంకొందరు మహిళల్లో అకారణంగా (అన్‌ ఎక్స్‌ప్లెయిన్డ్‌ ఇన్‌ఫెర్టిలిటీ) ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఏర్పడుతుంది. భార్యాభర్తలిద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ, గర్భధారణ జరగదు. మహిళలు గర్భం ధరించలేకపోవడానికి 40 శాతం కారణం వారి భర్తల్లో ఉంటే, 40 శాతం మహిళల్లో, మిగతా 10 నుంచి 20 శాతం వివరణకు నోచుకోని కారణాలు ఉంటాయి. ఈ 10 నుంచి 20 శాతం కారణాలలో ఒత్తిడికి ప్రధాన భాగం ఉంటుంది.


గర్భధారణ ప్లానింగ్‌ ఇలా...

గర్భం ధరించాలని ప్లాన్‌ చేసుకునే మహిళలు మూడు నెలల ముందు నుంచే అందుకు శరీరాన్ని ఇలా సిద్ధం చేయాలి.

ఫోలిక్‌ యాసిడ్‌: బిడ్డ నాడీ వ్యవస్థ ఎదుగుదలకు తోడ్పడే పోషకం ఇది. ఫోలిక్‌ యాసిడ్‌ లోపంతో గర్భంలోని బిడ్డలో స్కాల్ప్‌ ఏర్పడదు. అలాగే కొన్ని వెన్ను సంబంధ లోపాలు కూడా తలెత్తవచ్చు. ఈ సమస్యలన్నిటినీ ఫోలిక్‌ యాసిడ్‌తో నియంత్రించవచ్చు. కాబట్టి గర్భధారణకు కొన్ని నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకోవడం అవసరం. 

ఆరోగ్య సమస్యలు: థైరాయిడ్‌, మధుమేహం, రక్తలేమి లాంటి సమస్యలేవీ లేవని పరీక్షలతో నిర్థారించుకోవాలి. ఆ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ ఉంటే, రక్తలేమితో గర్భం దాల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో లేదా నెలలు నిండకుండా పుట్టే అవకాశాలుంటాయి. 

అధిక బరువు: బరువు ఎక్కువగా ఉంటే, దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. 

డైట్‌: జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ప్రొటీన్‌ ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, సిట్రస్‌ పండ్ల్లు, హీమోగ్లోబిన్‌ కోసం ముదురు రంగు పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. స్వీట్లు బాగా తగ్గించాలి.

వ్యాయామం: వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం వారంలో ఐదు రోజుల పాటైనా రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలి. ఇలా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సాధించినా గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.

సప్లిమెంట్లు: పోషక లోపాలుంటే, వాటిని వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లతో భర్తీ చేసుకోవాలి.


30 దాటితే...

అబార్షన్లు: 35 నుంచి 40 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం వల్ల అబార్షన్లయ్యే అవకాశాలు ఎక్కువ. 

క్రోమోజోమ్‌ సమస్యలు: గర్భం దాల్చగలిగినా, పుట్టే పిల్లల్లో క్రోమ్‌జోమ్‌ సమస్యల మూలంగా డౌన్స్‌ సిండ్రోమ్‌ లాంటి జన్యు సమస్యలు తలెత్తవచ్చు. 

మధుమేహం: మధుమేహంతో గర్భం దాలిస్తే, గర్భంలోని బిడ్డ బరువు ఎక్కువగా పెరిగిపోయి, సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవచ్చు. గర్భిణుల్లో చక్కెరలు ఎక్కువగా ఉంటే, పుట్టే బిడ్డలో గుండె సమస్యలు, అవయవ లోపాలు తలెత్తవచ్చు.

అధిక రక్తపోటు: గర్భిణికి అధిక రక్తపోటు ఉంటే, ఫిట్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవి తల్లికీ, బిడ్డకూ ప్రమాదకరం. అధిక రక్తపోటు వల్ల, గర్భాశయంలోని మాయ విచ్చుకుపోయి, గర్భంలోనే బిడ్డ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. 

నెలలు నిండకుండా: లేటు వయసులో గర్భం దాల్చిన మహిళలకు, పిల్లలు నెలలు నిండకుండా పుట్టే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్‌: సాధారణ ప్రసవం కష్టతరమై, సిజేరియన్‌ అవకాశాలు పెరుగుతాయి.


పిల్లల్లో సమస్యలు

లేటు వయసులో పిల్లలను కనడం వల్ల, పిల్లల బాగోగులు చూసే ఓపిక తల్లుల్లో నశించే అవకాశాలు ఎక్కువ. దాంతో పిల్లల్లో మానసిక రుగ్మతలు, ఆటిజం, అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ లాంటి సమస్యలు మొదలవుతాయి. అలాగే బిడ్డకు సరిపడా సమయం కేటాయించకపోవడం మూలంగా తల్లికీ, బిడ్డకూ మధ్య బంధం బలపడదు.


ఐ.వి.ఎఫ్‌ సమస్యలు

లేటు వయసులో గర్భధారణ కోసం ఐ.వి.ఎఫ్‌ను ఆశ్రయించేవాళ్లు ఎక్కువ. అయితే అన్ని సందర్భాల్లో ఐ.వి.ఎఫ్‌ విజయవంతమవుతుందని చెప్పలేం. ఒకవేళ విజయవంతమై గర్భం దాల్చినా, పిల్లలు నెలలు నిండకుండా ప్రిమెచ్యూర్‌గా పుట్టే అవకాశాలుంటాయి. కొందర్లో ఉమ్మనీటి సంచి చిరిగిపోయి, నీరు కారిపోయి, ప్రిమెచ్యూర్‌ బేబీస్‌ పుడతారు. ఇలా పుట్టిన పిల్లలను ఎన్‌ఐసియులో పెట్టవలసి ఉంటుంది. ఈ పరిస్థితికి చేరుకునే కొందరు పిల్లల్లో నాడీ సమస్యలు, మానసిక సమస్యలు, గుండె సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. అలాగే ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తవచ్చు. సాధారణ పిల్లలతో సమానంగా ఎదగలేకపోవచ్చు. పిల్లలు చైల్డ్‌ ఒబేసిటీకి గురయ్యే అవకాశాలూ ఉంటాయి.
ఎగ్‌ బ్యాంకింగ్‌

ఎండోమెట్రియల్‌, యుటెరైన్‌ కేన్సర్‌ సోకిన మహిళలకు అందించే రేడియేషన్‌, కీమోథెరపీల ప్రభావంతో అండాలు తగ్గిపోతాయి. అలాంటి మహిళలు తర్వాతి రోజుల్లో గర్భధారణ కోసం అండాలను దాచుకోవచ్చు. ఎగ్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం ప్రధానంగా ఈ మహిళలే లక్ష్యంగా అందుబాటులోకి వచ్చింది. అయితే కెరీర్‌, లేట్‌ మ్యారేజ్‌ మూలంగా గర్భధారణ ఆలస్యమయ్యే వీలున్న మహిళలు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే 20 ఏళ్ల వయసులో అండాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఆలస్యంగా ఆరోగ్యవంతమైన పిల్లలను కనాలనుకునే మహిళలు, 20 ఏళ్ల వయసులోనే అండాలను భద్రపరుచుకోవచ్చు. 


ప్రీకన్‌సెప్షనల్‌ కౌన్సెలింగ్‌ 

భవిష్యత్తు గర్భధారణ కోసం ప్రీకన్‌సెప్షనల్‌ కౌన్సెలింగ్‌ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా కుటుంబ చరిత్ర, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి, రిస్క్‌ ఫ్యాక్టర్లు మొదలైన అంశాలను వైద్యులు చర్చించి, గర్భధారణ అవకాశాలను బేరీజు వేసి, అందుకు సరైన వయసును సూచిస్తారు. గర్భధారణకు సంబంధించిన అనుమానాలను ఇలాంటి ప్రీకన్‌సెప్షనల్‌ కౌన్సెలింగ్‌తో నివృత్తి చేసుకోవచ్చు. 


-డాక్టర్ ప్రత్యూష రెడ్డి,

అబ్‌స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్.Read more