అన్ని కేసుల్లో జుబేర్‌కు బెయిల్‌

ABN , First Publish Date - 2022-07-21T07:41:39+05:30 IST

ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.

అన్ని కేసుల్లో జుబేర్‌కు బెయిల్‌

మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు

రాయొద్దని ఓ జర్నలిస్టును ఎలా ఆదేశిస్తాం?

వాదించొద్దని లాయర్ను అడగడం భావ్యమేనా??

ధర్మాసనం వ్యాఖ్య.. విచారణ ఢిల్లీకి మార్పు’


న్యూఢిల్లీ, జూలై 20: ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆరు కేసుల్లో బెయిల్‌ మంజూరు కావడంతో.. బుధవారం సాయంత్రం ఆయన తిహార్‌ జైల్‌ నుంచి విడుదలయ్యారు. ఓ వర్గం పౌరుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ గత నెల 27న ఢిల్లీ పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. ఐపీసీలోని సెక్షన్లు 120బీ, 153, 201, 295.. విదేశీ విరాళాల సేకరణ ఆరోపణలపై ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 35 కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఢిల్లీతోపాటు.. యూపీ, పలు రాష్ట్రాల్లో అతనిపై కేసులున్నాయి. ఈ కేసులన్నింటినీ కలిపి ఒకే చోట దర్యాప్తు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ.. జుబేర్‌ తరఫు న్యాయవాదులు రింద గ్రోవర్‌, షౌతిక్‌ బెనర్జీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అదేవిధంగా జుబేర్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బోపన్నల ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారిస్తూ.. జుబేర్‌కు మొత్తం కేసుల్లో(ఆరు) రూ. 20వేల పూచీకత్తుతో మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జైలు అధికారులు అతణ్ని వెంటనే విడుదల చేస్తారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా.. పోలీసులు తమ కస్టడీలోనే ఉంచుకోవడం సరికాదని స్పష్టం చేసింది. పలుచోట్ల నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఒకటిగా చేసి.. ఢిల్లీ పోలీసులకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఇక ఈ కేసుల దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్‌తో అవసరం ఉండబోదని స్పష్టం చేసింది. దాంతో.. సిట్‌ రద్దయిపోయింది. అంతకు ముందు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ గరిమా ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. జుబేర్‌ చేసే పోస్టులకు విదేశీ విరాళాలు వస్తాయని.. అలా నెలకు రూ. 12 లక్షలు తీసుకుంటాడని పేర్కొన్నారు. పోలీసు దర్యాప్తులో జుబేర్‌ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించాడని, విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే పోస్టుల తీవ్రతను బట్టి డబ్బులు అందుతాయని పేర్కొన్నారు. అలా ఓసారి రూ. 2 కోట్ల నిధులు తీసుకున్నాడని వివరించారు. అతనికి బెయిల్‌ ఇస్తే.. విద్వేషపూరిత పోస్టులు చేయకూడదని ఆదేశించాలని కోర్టును కోరారు. ధర్మాసనం కల్పించుకుంటూ.. ఓ జర్నలిస్టును రాయొద్దని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ‘‘ఓ న్యాయవాదిని వాదనలు వినిపించొద్దని ఆదేశించడం సమంజసమేనా? అలాగే జర్నలిస్టు విషయంలో అలాంటి ఆదేశాలు చేయలేం’’ అని స్పష్టం చేసింది. దీంతో, గరిమ కల్పించుకుంటూ.. జుబేర్‌ అసలు జర్నలిస్టే కాదని.. ఆ విషయాన్ని అతనే అంగీకరించాడని వివరించారు. అయినా.. ట్వీట్లు, పోస్టులు చేయకుండా జుబేర్‌ని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read more