మీరే స్ఫూర్తిప్రదాతలు
ABN , First Publish Date - 2022-08-15T09:36:27+05:30 IST
దేశానికి యువత, రైతులు, మహిళలే స్ఫూర్తిప్రదాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రస్తుతం వీరి నుంచే దేశం ఆత్మవిశ్వాసాన్ని పొందుతోందన్నారు.

- మీతోనే దేశం ఆత్మవిశ్వాసం పొందుతోంది...
- యువత, మహిళలు, రైతులను ఉద్దేశించి ముర్ము
- రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశానికి యువత, రైతులు, మహిళలే స్ఫూర్తిప్రదాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రస్తుతం వీరి నుంచే దేశం ఆత్మవిశ్వాసాన్ని పొందుతోందన్నారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో... అనేక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యంగా... భారతీయ క్రీడాకారిణులు అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ దేశానికి గర్వకారణంగా మారారన్నారు. వీరిలో చాలామంది సమాజంలోని అట్టడుగు వర్గాల నుంచి రావటం స్ఫూర్తిదాయకం అన్నారు. రాష్ట్రపతి మాట్లాడుతూ... ‘‘ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ మహిళలు ముందుకు సాగుతున్నారు. సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. పంచాయతీల్లో 14లక్షల మంది మహిళా ప్రతినిధులు ఉండటమే దీనికి నిదర్శనం’’ అని పేర్కొన్నారు. 75ఏళ్ల ప్రస్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి భారత్ చూపించిందన్నారు రాష్ట్రపతి. అలాగే ‘‘దేశం సంస్కరణల పథంలో దూసుకుపోతోంది. అదే సమయంలో సంక్షేమ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. పేదలకు కనీస సౌకర్యాలు అందించడం లక్ష్యంగా.... ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఇంటింటికీ మంచినీరు (హర్ ఘర్ జల్) వంటి పథకాలు అమలవుతున్నాయి’’ అన్నారు. కొవిడ్ సంక్షోభంలో భారత్ స్పందించిన తీరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామన్నారు.
ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో...
ఇప్పుడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదేనని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ వ్యవస్థ అంతర్జాతీయంగా ఉత్తమ స్థానంలో ఉందన్నారు. పెద్ద కంపెనీల సంఖ్య పెరుగుతోందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నామనడానికి ఇదే నిదర్శనమని రాష్ట్రపతి వివరించారు. అంతేగాక... ‘‘అభివృద్ధిలో రైతులు, కార్మికుల కృషి కూడా ఉంది. వ్యాపారవేత్తల దక్షతతో దేశంలో సంపద పెరిగింది. ప్రాంతీయ వ్యత్యాసాలు కూడా తగ్గుతున్నాయి’’ అని ద్రౌపది ముర్ము తెలిపారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘2047 నాటికి మహోన్నత భారత్‌ను నిర్మించుకోవాలి. మాతృదేశం కోసం యువత ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. తోటివారి అభ్యున్నతికి పాటుపడాలి’’ అన్నారు. దేశంలో ఎంతో వైవిథ్యం ఉందని, అయితే ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో కలిసి నడుస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ అమృత మహోత్సవాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ పండగ దేశ ప్రజలందరికీ అంకితం. దేశం నలుమూలలా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి మళ్లీ కనిపిస్తోంది. వచ్చే పాతికేళ్లలో అమరవీరుల లక్ష్యాలను సాకారం చేయాలి’’ అన్నారు.