Congress Crisis : నిన్న హార్దిక్, నేడు జక్కర్ ఝలక్... రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు...
ABN , First Publish Date - 2022-05-19T22:11:07+05:30 IST
ఓ వైపు గుజరాత్ శాసన సభ ఎన్నికలు, మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికలు

న్యూఢిల్లీ : ఓ వైపు గుజరాత్ శాసన సభ ఎన్నికలు, మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండగా, కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలు వరుసగా బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపడంలో రాజస్థాన్‌లో జరిగిన మేధోమథనం సమావేశాల ప్రభావం కనిపించడం లేదు. గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ (Hardik Patel) ఆ పార్టీని వదిలిపెట్టి, విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జక్కర్ (Sunil Jakhar) ఆ పార్టీని వదిలిపెట్టి బీజేపీ (BJP)లో చేరిపోయారు. ఇటువంటి ముఖ్యమైన సమయంలో కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశాలకు బయల్దేరారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా (Randeep Surjewala) గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) లండన్‌లో శుక్రవారం జరిగే ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలతో దేశ ప్రస్తుత, భవిష్యత్తు పరిణామాలపై ఆయన మాట్లాడతారని చెప్పారు. మే 23న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగే ‘‘ఇండియా ఎట్ 75 : ది ఛాలెంజెస్ అండ్ వే ఎహెడ్ ఫర్ ఏ రెసిలియెంట్-మోడర్న్ ఇండియా’పై ప్రసంగిస్తారని తెలిపారు.
రాహుల్ గాంధీ గురువారం సాయంత్రం లండన్ చేరుకుంటారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, ప్రియాంక్ ఖడ్గే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇదిలావుండగా, ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పటిష్ట వ్యూహాలు రచించవలసిన సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళడాన్ని విశ్లేషకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఈ నెలలో జరిగిన మేధోమథనం సమావేశాల్లో రానున్నలోక్‌సభ ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయడానికి రోడ్‌మ్యాప్‌పై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.