అంతరిక్షంలో అద్భుతం

ABN , First Publish Date - 2022-09-28T07:09:50+05:30 IST

సుదూర విశ్వంలో ఎక్కడో భారీ విస్ఫోటం జరుగుతుంది. భారీ గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకువస్తుంది.

అంతరిక్షంలో అద్భుతం

స్పేస్‌క్రాఫ్ట్‌తో ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టిన నాసా.. 10 నెలల క్రితమే ఆపరేషన్‌ ప్రారంభం


డార్ట్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపిన సంస్థ

90 లక్షల కిలోమీటర్ల దూరంలో డైమార్ఫస్‌ అనే ఆస్టరాయిడ్‌తో మంగళవారం ఢీ

భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాల దారి మళ్లించడమే లక్ష్యంగా  ప్రయోగం

ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందన్న నాసా 

డైమార్ఫస్‌లో మార్పుపై కొన్ని నెలల్లో స్పష్టత


కేప్‌ కానావెరాల్‌, సెప్టెంబరు 27: సుదూర విశ్వంలో ఎక్కడో భారీ విస్ఫోటం జరుగుతుంది. భారీ గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకువస్తుంది. అది భూమిని తాకితే మానవాళి అంతమవుతుందని తెలుసుకున్న సూపర్‌ హీరో.. భూగ్రహాన్ని కాపాడే బాధ్యతను తలకెత్తుకుంటాడు. ఆ గ్రహశకలాన్ని దారి మళ్లిస్తాడు. జీవకోటిని రక్షిస్తాడు. ఎన్నో హాలీవుడ్‌ సినిమాలకు ఇది కథాంశం. కానీ ఈ కథాంశం వాస్తవంగా జరిగితే.. భూమి వైపు దూసుకువచ్చే గ్రహశకలాన్ని మానవులు దారి మళ్లిస్తే.. కల నిజమైతే. అవును. చరిత్రలో మొట్టమొదటిసారిగా నాసా ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టింది. భూమికి 90 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రహశకలాన్ని స్పేస్‌ క్రాఫ్ట్‌తో ఢీకొట్టింది. దాని దారి మళ్లించింది. ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని ప్రకటించింది. భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమి వైపు వస్తుంటే దాని దారి మళ్లించడం సాధ్యమేనని భరోసా కల్పించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లానెటరీ డిఫెన్స్‌ టెక్నాలజీ(గ్రహ రక్షణ సాంకేతికత) ప్రయోగం ఇది.


కొన్ని నెలల్లో స్పష్టత

గ్రహశకలాలను దారి మళ్లించే అవకాశాలపై పరిశోధనల్లో భాగంగా నాసా డార్ట్‌(డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్టు) స్పేస్‌క్రా్‌ఫ్టను 10 నెలల క్రితం అంతరిక్షంలోకి పంపింది. స్పేస్‌ క్రాఫ్ట్‌తో ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టడం ద్వారా దాని దారి మళ్లించాలనేది నాసా ఉద్దేశ్యం. ప్రయోగం కోసం నాసా.. భూమికి 90 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమార్ఫస్‌ అనే ఆస్టరాయిడ్‌ను ఎంచుకొంది. ఇది డీడైమోస్‌ అనే మరో పెద్ద గ్రహశకలం చుట్టూ తిరుగుతోంది. నాసా ప్రయోగించిన డార్ట్‌ భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుఝామున.. గంటకు 22,500 కిలోమీటర్ల వేగంతో డైమార్ఫ్‌సను ఢీకొట్టింది. ఈ చర్యతో డైమార్ఫస్‌ గమనంలో ఒక్క శాతం తేడా వచ్చినా ఆ ప్రభావం కాలక్రమంలో ఎంతో ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రభావం ఎంత ఉంటుందనే దానిపై కొన్ని నెలల్లో స్పష్టత వస్తుందన్నారు.  డైమార్ఫస్‌, డీడైమోస్‌ భూమికి చాలా దూరంలో ఉన్నాయి. వాటితో భూమికి ఎలాంటి ముప్పు లేదు. అందుకే శాస్త్రవేత్తలు వీటిని ప్రయోగానికి ఎంచుకున్నారు. ఈ ప్రయోగం కోసం నాసా రూ.2,650 కోట్లు ఖర్చు చేసింది. 


ఇది సినిమా కాదు.. నిజం

ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టడానికి ముందు డార్ట్‌లో ఉన్న ప్రత్యేకమైన కెమెరా డైమార్ఫ్‌సను కొన్ని వారాల పాటు చిత్రీకరించింది. ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టిన అనంతరం డార్ట్‌ ధ్వంసమైంది. డార్ట్‌తో పాటు పంపిన మరో ఉపగ్రహం లిసియాక్యూబ్‌ పంపిన ఫొటోల్లో గ్రహశకలం నుంచి వెలువడ్డ దుమ్ము స్పష్టంగా కనిపించింది. ‘ఇది సినిమా కాదు. మనం ఆర్మగెడ్డన్‌ లాంటి సినిమాల్లో ఇలాంటి వాటిని చూశాం. కానీ ఇది నిజం’ అని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ ట్వీట్‌ చేశారు.  ‘డైనోసార్లకు స్పేస్‌ ప్రోగ్రాం తెలియదు. అందుకే అవి ఆస్టరాయిడ్‌ రాకను తెలుసుకోలేకపోయాయి. కానీ మనకు ఆస్టరాయిడ్లను దారి మళ్లించడమూ తెలుసు’ అని నాసా సీనియర్‌ క్లైమేట్‌ అడ్వైజర్‌ కేథరిన్‌ కాల్విన్‌ వ్యాఖ్యానించారు. 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భారీ ఆస్టరాయిడ్‌ వల్లే డైనోసార్లు అంతరించి పోయాయని శాస్త్రవేత్తలు భావిస్తున్న సంగతి తెలిసిందే. 


2013 రష్యా మీదికి గ్రహశకలం

140 మీటర్లు, అంతకన్నా వెడల్పు ఉండే గ్రహశకలాలు భూమిని ఢీకొడితే ఒక రాష్ట్రం మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రవేత్తల  అభిప్రాయం. 2013లో రష్యాలోని చెల్యాబిన్స్క్‌ నగరం మీదికి 20 మీటర్ల వెడల్పైన గ్రహశకలం దూసుకువచ్చింది. అదృష్టవశాత్తూ అది గాల్లోనే మండిపోయింది. అయితే, గ్రహశకలం మండిపోవడం వల్ల ఉత్పన్నమైన ప్రకంపనల కారణంగా నగరంలోని భవనాల అద్దాలు పగిలాయి. 

Read more