మద్యం... మరింత ప్రియం

ABN , First Publish Date - 2022-03-08T13:55:56+05:30 IST

రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. కొత్త ధరలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఆ ప్రకారం మద్యం రకాలు 180 మి.లీ రూ.10 నుంచి రూ.20, 375 మి.లీ రూ.20 నుంచి రూ.40,

మద్యం... మరింత ప్రియం

- అమల్లోకి వచ్చిన ధరలు

- ప్రభుత్వానికి రూ.4,396 కోట్ల అదనపు ఆదాయం


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. కొత్త ధరలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఆ ప్రకారం మద్యం రకాలు 180 మి.లీ రూ.10 నుంచి రూ.20, 375 మి.లీ రూ.20 నుంచి రూ.40, 750 మి.లీ రూ.40 నుంచి రూ.80 వరకు పెరిగాయి. ఈ నెల 5న జరిగిన మంత్రివర్గం సమావేశంలో మద్యం ధరలు పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ధరల పెంపుతో రాష్ట్రప్రభుత్వానికి ఏడాదికి రూ.4,396 కోట్లు అదనపు ఆదాయం సమకూరనుంది. తమిళనాడు వాణిజ్య సంస్థ (టాస్మాక్‌) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొవిడ్‌ సమయంలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసిన టాస్మాక్‌ దుకాణాలు, ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులతో పాత సమయా ల్లోనే నడుస్తున్నాయి. కాగా కొత్తధరల ప్రకారం క్వార్టర్‌పై రూ. 10 నుంచి రూ.20 వరకు పెరగగా, ఆఫ్‌ బాటిల్‌ పై రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగాయి. అలాగే ఫుల్‌ బాటిల్‌పై రూ.40 నుంచి రూ.80 వరకు పెంచారు. ఇక, బీర్‌ బాటిల్‌ ధర రూ.10 మేరకు పెరిగింది. కొత్త ధరలతో ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా రోజుకు రూ.10.35 కోట్లు, బీరుపై రూ.1.76 కోట్ల ఆదాయం సమకూరనుందని టాస్మాక్‌ అధికారులు తెలిపారు. మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో ప్రతి ఏటా 20 శాతం చొప్పున ఆదాయం పెరుగుతోంది. టాస్మాక్‌ ప్రారంభించిన 1983లో ఏడాదికి రూ.183 కోట్లుండగా, 2002-03లో రూ.3,499.75 కోట్లకు చేరుకుంది. ఈ విక్రయాలకు సంబంధించిన ప్రభుత్వానికి ఎక్సైజ్‌ సుంకం ద్వారా రూ.2,828 కోట్ల ఆదాయం సమకూరింది. అనంతరం ప్రతి ఏడాది మద్యం విక్రయాలు పెరిగి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఆ ప్రకారం 2010-11లో మద్యం రూ.14,965 కోట్ల మద్యం ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,500లకు పైగా మద్యం దుకాణాలను టాస్మాక్‌ నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆర్ధికాదాయంలో టాస్మాక్‌ ముఖ్యభూమిక పోషించడం గమనార్హం.

Read more