SIT Enquiry : సిట్‌ విచారణకు వస్తారా?

ABN , First Publish Date - 2022-11-21T02:14:24+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సోమవారం కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీ మారాల్సిందిగా బేరసారాలు జరుపుతూ మొయినాబాద్‌ ఫాంహౌ్‌సలో రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి అక్టోబరు 26న పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.

 SIT Enquiry : సిట్‌ విచారణకు వస్తారా?

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంతోష్‌, తుషార్‌, జగ్గుజీ, శ్రీనివాస్‌కు నోటీసులు

నేడు 10.30కే హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సోమవారం కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీ మారాల్సిందిగా బేరసారాలు జరుపుతూ మొయినాబాద్‌ ఫాంహౌ్‌సలో రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి అక్టోబరు 26న పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా, విచారణలో వారు ముగ్గురు ఇచ్చిన సమాచారం, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ విశ్లేషణ, వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నలుగురికి 41(ఏ) సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళకు చెందిన తుషార్‌, కేరళ వైద్యుడు జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివా్‌సను తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే నలుగురికి ఒకే ఫార్మాట్‌లో నోటీ్‌సలు జారీ చేసిన సిట్‌.. వారందరినీ ఒకేరోజు (సోమవారం), ఒకే సమయంలో (ఉదయం 10.30 గంటలకు) బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ నేరుగా నోటీసులు ఇవ్వలేదని సమాచారం. వారి ఇళ్లు, కార్యాలయాలకు నోటీసులు అంటించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లో జారీ చేయడమో జరిగినట్లు తెలిసింది. కరీంనగర్‌లో న్యాయవాది శ్రీనివాస్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి తలుపునకు నోటీసులు అంటించారు.

సంతో్‌షకు నోటీసులు అందాయా?

బీజేపీ నేత సంతోష్‌ జీని నేరుగా కలిసే పరిస్థితి లేకపోవడంతో ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపి, వారి ద్వారా ఆయనకు అందేలా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి సంతోష్‌ జీకి సమన్లు జారీ చేసేందుకు సిట్‌ అధికారులు ఢిల్లీలో కొద్దిరోజులుగా వేచి చూశారని, కానీ.. ఆయనను కలుసుకోలేక పోయారని తెలిసింది. అయితే ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ మూడు రోజుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి సంతోష్‌ జీ మంగళవారం హాజరవుతారని, ఆ సందర్భంగా సిట్‌ అధికారులు ఆయనకు నోటీసులు ఇస్తారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో జగ్గుస్వామి పాత్రను తేల్చేందుకు సిట్‌ అధికారులు కేరళకు వెళ్లగా వారు వస్తున్న విషయాన్ని ముందే తెలుసుకొని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు తుషార్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో వీరిద్దరికీ నోటీసులను పరోక్షంగానే ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు ఎవరెవరు హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరైనా హాజరైనా.. సిట్‌ విచారణలో ఎంత వరకు నోరు విప్పుతారనేదీ తేలాల్సి ఉంది. 41(ఏ) సీఆర్‌పీసీ కింద సిట్‌ నోటీసులు జారీ చేసినందున.. వీరిలో ఎవరైనా విచారణకు హాజరు కాకపోతే కోర్టును ఆశ్రయించి విచారణకు సహకరించడం లేదనే కారణంతో అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు.

కమాండ్‌ కంట్రోల్‌లో మొదటి విచారణ..

తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణే మొదటిది కానుంది. నోటీసులు జారీ చేసిన నలుగురిని విచారించేందుకు 16, 17వ అంతస్తుల్లో ప్రత్యేక గది ఏర్పాటు చేసినట్లు సమాచారం. విచారణకు హాజరయ్యే వారి ప్రతి కదలిక, హావభావాలు, విచారణ సమయంలో సిట్‌ ప్రశ్నలు, వారు ఇచ్చే సమాధానాలు, తమ వద్ద ఉన్న ఆధారాలు ముందు ఉంచిన సమయంలో వారి స్పందన.. ఇలా అన్ని అంశాలు స్పష్టంగా రికార్డయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. సిట్‌ విచారణ ఎదుర్కొంటున్న వారిలో జాతీయ స్థాయి వ్యక్తి, ప్రముఖులు ఉన్న నేపథ్యంలో భద్రతా పరంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రోజుకు 14 గంటలు ఇదే పనిలో..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో.. సిట్‌ దర్యాప్తును అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. క్షణం కూడా వృధా కానివ్వడంలేదు. ఐదు రాష్ట్రాల్లో సోదాలకు వెళ్లడం, రోజుల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి రావడంతో ప్రయాణం కోసం ఎప్పుడు, ఎక్కడ ఏది అందుబాటులో ఉంటే ఆ ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంది. సిట్‌ బృందంలో ఉన్నవారు రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లిన సిట్‌కు ఒక చోట పోలీసులు సహకారం అందిస్తే, మరోచోట నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేరళలోని కోచి వెళ్లిన సమయంలో అక్కడి పోలీసులు పూర్తి సహకారం అందించగా.. బీఎల్‌ సంతో్‌షకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించలేదని తెలిసింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో నవంబరు 11న ఏర్పాటైన సిట్‌లో మరికొంత మంది అధికారులను సభ్యులుగా చేర్చుకున్నట్లు సమాచారం. దర్యాప్తు చేస్తున్న క్రమంలో టెక్నికల్‌ టీంతోపాటు, చురుగ్గా ఉన్న మరికొంత మంది అవసరం ఏర్పడటంతో వారిని తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి స్వర నమూనాలను అరెస్ట్‌ సమయంలో రికార్డు చేసిన వాటితో సరిపోల్చేందుకు ఎఫ్‌ఎ్‌సఎల్‌లో ఇచ్చిన స్వర నమూనా పరీక్ష ఫలితాలు ఒకటి, రెండు రోజుల్లో సిట్‌ చేతికి అందనున్నాయి.

Updated Date - 2022-11-21T02:14:24+05:30 IST

Read more