‘కోహినూర్‌’ భారత్‌కు దక్కేనా?

ABN , First Publish Date - 2022-09-10T08:18:42+05:30 IST

కాకతీయుల కాలంలో 14వ శతాబ్దంలో లభించిందని భావిస్తున్న అత్యంత విలువైన ‘కోహినూర్‌’ వజ్రం బ్రిటన్‌ రాజప్రాసాదం నుంచి ఇప్పటికైనా భారత్‌కు చేరుతుందా?..

‘కోహినూర్‌’ భారత్‌కు దక్కేనా?

ఎలిజబెత్‌-2 మరణం తర్వాత 

తిరిగి రప్పించాలని డిమాండ్‌

పాక్‌, అఫ్ఘాన్‌లదీ ఇదే పట్టు

ఇచ్చేది లేదంటున్న బ్రిటన్‌

నెటిజన్ల ఆసక్తికర ట్వీట్లు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: కాకతీయుల కాలంలో 14వ శతాబ్దంలో లభించిందని భావిస్తున్న అత్యంత విలువైన ‘కోహినూర్‌’ వజ్రం బ్రిటన్‌ రాజప్రాసాదం నుంచి ఇప్పటికైనా భారత్‌కు చేరుతుందా? ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తలెత్తుతున్న సందేహాలు. వజ్రాన్ని వెనక్కి రప్పించాలంటూ ట్విటర్‌ వేదికగా నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఎలిజబెత్‌-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆమె ధరించిన 105.6 క్యారెట్ల అమూల్యమైన కోహినూర్‌ వజ్రంతో కూడిన కిరీటం ఇక నుంచి ఆమె కోడలు, కెమిల్లాకు దక్కనుంది. చార్లెస్‌ పట్టాభిషేకం సందర్భంగా 2800 వజ్రాలను పొదిగిన కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు.


లాహోర్‌ ఒప్పందంలో భాగంగా 1849లో లాహోర్‌ మహారాజు దులీప్‌ సింగ్‌ ఈ వజ్రాన్ని తీసుకుని బ్రిటీష్‌ వారికి అప్పగించారు. అప్పటి నుంచి బ్రిటన్‌ రాజాభరణాల్లో ఈ వజ్రం భాగమైంది. అయితే.. దీన్ని కేవలం మహిళలు మాత్రమే ధరించాలని.. లేదా భగవంతుడి ఆభరణాల్లో పొదగవచ్చని ప్రచారం ఉంది. పురుషులు ధరిస్తే రక్తపాతం తప్పదనే ప్రచారం కూడా ఉండడం గమనార్హం. 


ససేమిరా అంటున్న బ్రిటన్‌

కోహినూర్‌ను స్వదేశానికి తెప్పించేందుకు భారత ప్రభుత్వం 1947 నుంచే ప్రయత్నాలు చేసింది. 1953లో బ్రిటన్‌ రాణిగా పట్టాభిషిక్తురాలైన ఎలిజబెత్‌-2కు సైతం తిరిగి ఇవ్వాలని విన్నవించింది. అయినా.. ఈ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఏకంగా రాజ్యసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టి 50 మంది ఎంపీలు సంతకం కూడా చేశారు. 2009లో మహాత్మా గాంధీ మనవడు తుషార్‌ గాంధీ కూడా డిమాండ్‌ చేయగా 2013లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ తోసిపుచ్చారు. స్నేహపూర్వక పద్ధతిలో దీనిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత పురావస్తు విభాగం కొంతకాలం క్రితం ప్రకటించింది. ఇదిలావుంటే, కోహినూర్‌ తమదంటే తమదేనని పాకిస్థాన్‌, ఇరాన్‌, అఫ్ఘానిస్థాన్‌లు సైతం చెబుతున్నాయి. కోహినూర్‌ను తమకే అప్పగించాలంటూ.. 1976లో పాక్‌ ప్రధాని భుట్టో బ్రిటన్‌ ప్రధానికి లేఖ రాశారు. 2000 సంవత్సరంలో తాలిబన్లు కూడా కోహినూర్‌ తమదేనని, త్వరగా తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


రేపు జాతీయ సంతాపం దినం

ఎలిజబెత్‌-2 గౌరవార్థం కేంద్రం ప్రకటన 

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 గౌరవార్థం ఈ నెల 11ను భారత్‌ సంతాపదినంగా ప్రకటించింది. ఆ రోజు జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని సూచిస్తూ కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సంతాప దినం కావున ఆ రోజు అధికారికంగా ఎలాంటి ఉత్సవాలు, వినోద కార్యక్రమాలను నిర్వహించరాదని పేర్కొంది. క్వీన్‌ ఎలిజబెత్‌-2 అనారోగ్య కారణాలతో గురువారం చనిపోయిన సంగతి తెలిసిందే.

Read more