బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలి? : Mamata Banerjee
ABN , First Publish Date - 2022-06-11T18:28:12+05:30 IST
పశ్చిమ బెంగాల్లోని హౌరాలో శుక్రవారం జరిగిన హింసాత్మక సంఘటనల

కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని హౌరాలో శుక్రవారం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. హౌరాలో జరుగుతున్న సంఘటనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. అల్లర్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బీజేపీ (BJP) నుంచి సస్పెండయిన నూపుర్ శర్మ (Nupur Sharma) ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త (Prophet Muhammad)పై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆమెను అరెస్టు చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. హౌరాలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
మమత బెనర్జీ (Mamata Banerjee) శనివారం ఇచ్చిన ఓ ట్వీట్లో, బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. తాను ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పానన్నారు. హౌరాలో జరుగుతున్నదాని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. అల్లర్లు జరగాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయని, అటువంటిదానిని తాము సహించబోమని చెప్పారు. అలాంటివారందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హౌరా (Howrah) లోని జాతీయ రహదారిపై రెండు రోజుల నుంచి జరుగుతున్న నిరసనల నేపథ్యంలో పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉలుబెరియా సబ్ డివిజన్, హౌరా పరిధిలోని జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ఈ నిబంధనలు జూన్ 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో శుక్రవారం హింసాత్మక సంఘటనలు జరిగాయి.