Alibaba : చైనా కుబేరుడు జాక్ మా ఏమైపోయాడు? చైనాలో కనిపించని ఆచూకీ!

ABN , First Publish Date - 2022-11-30T20:38:54+05:30 IST

నిరుపేద కుటుంబంలో జన్మించి, అపర కుబేరుడిగా ఎదిగిన జాక్ మా (Jack Ma) చైనాలో కనిపించడం లేదు

Alibaba : చైనా కుబేరుడు జాక్ మా ఏమైపోయాడు? చైనాలో కనిపించని ఆచూకీ!

న్యూఢిల్లీ : నిరుపేద కుటుంబంలో జన్మించి, అపర కుబేరుడిగా ఎదిగిన జాక్ మా (Jack Ma) చైనాలో కనిపించడం లేదు! 2019లో రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ అలీబాబా గ్రూప్ (Alibaba Group) వ్యవస్థాపకుడు తాను వర్క్ డెస్క్ వద్ద కన్నా బీచ్‌లో మరణించడానికి ఇష్టపడతానని గతంలో చెప్పారు. అయితే ఆయన ఆ తర్వాత చాలా దేశాల్లో పర్యటించారని, ప్రస్తుతం జపాన్‌ (Japan)లోని టోక్యో (Tokyo) నగరంలో నివసిస్తున్నారని తెలుస్తోంది. అక్కడ ఆయన తన కుటుంబ సభ్యులతో సహా నివసిస్తున్నట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.

రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన తర్వాత 2020 అక్టోబరులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రభుత్వ బ్యాంకుల మనస్తత్వం కాబూలీవాలా (విలువైన వస్తువులను తనఖా పట్టుకుని, డబ్బులిచ్చే) దుకాణదారు మనస్తత్వం వంటిదని అన్నారు. దీంతో ఆయన కంపెనీలపై చైనా ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆయన స్థాపించిన యాంట్ (Ant), అలీబాబా (Alibaba) కంపెనీలపై రెగ్యులేటరీ సంస్థలు విరుచుకుపడ్డాయి.

ఇదిలావుండగా, ఆయన ఈ ప్రసంగం చేసిన తర్వాత మౌనంగా ఉన్నారు. ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ అనే తన సొంత టాలెంట్ షో తుది ఎపిసోడ్‌కు కూడా ఆయన హాజరుకాలేదు. తన కంపెనీలు చైనా రెగ్యులేటరీ సంస్థల కన్నెర్రకు గురైనప్పటి నుంచి ఆయన తన కుటుంబంతో సహా విదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం జపాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ, హాట్ స్ప్రింగ్స్, స్కీ రిసార్టుల్లో గడుపుతున్నారని మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ఆయన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో తరచూ పర్యటిస్తున్నట్లు సమాచారం. స్పానిష్ ఐలాండ్‌లో కూడా ఆయన కనిపించినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా, జాక్ మా 2015లో మన దేశంలో పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై, మన దేశంలో వ్యాపార విస్తరణపై చర్చించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నాలేవీ చేసినట్లు కనిపించలేదు. కొసమెరుపు ఏమిటంటే, ఆయన తన స్వదేశం చైనాకు మాత్రం ఈ మధ్య కాలంలో వెళ్ళలేదని సమాచారం.

Updated Date - 2022-11-30T20:39:00+05:30 IST