పాకిస్థాన్‌పై తాలిబన్ల విమర్శలు

ABN , First Publish Date - 2022-03-05T20:47:16+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్ పంపించిన గోధుమలు నాసిరకంగా, నిరుపయోగకరంగా

పాకిస్థాన్‌పై తాలిబన్ల విమర్శలు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్ పంపించిన గోధుమలు నాసిరకంగా, నిరుపయోగకరంగా ఉన్నాయని తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నాణ్యమైన గోధుమలను పంపించిన భారత దేశానికి ఆఫ్ఘన్లు ధన్యవాదాలు చెప్తున్నారు. ఓ తాలిబన్ అధికారి పాకిస్థాన్‌ను విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోను ఓ ఆఫ్ఘన్ పాత్రికేయుడు ట్వీట్ చేశారు. కొందరు ట్విటరాటీలు భారత్‌ తమ శాశ్వత మిత్ర దేశమని ప్రశంసిస్తున్నారు. 


ఆఫ్ఘన్ పాత్రికేయుడు అబ్దుల్‌హక్ ఒమేరీ ఇచ్చిన ట్వీట్‌లో, పాకిస్థాన్ విరాళంగా పంపించిన గోధుమలు తినడానికి పనికిరావని ఓ తాలిబన్ అధికారి చెప్పినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా జత చేశారు. నాణ్యమైన గోధుమలను పంపించినందుకు భారత దేశానికి ఆఫ్ఘన్లు ధన్యవాదాలు చెప్తున్నట్లు తెలిపారు. 


హమ్‌దుల్లా అర్బాబ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు నిరంతరం సహకరిస్తున్నందుకు భారత దేశానికి ధన్యవాదాలు చెప్పారు. మన ప్రజల మధ్య స్నేహ సంబంధాలు నిరంతరం, శాశ్వతంగా కొనసాగుతాయన్నారు. జైహింద్ అని నినదించారు. 


నజీబ్ ఫర్హోడిస్ అనే మరొక ట్విటరాటీ ఇచ్చిన ట్వీట్‌లో, పాకిస్థాన్ విరాళంగా ఇచ్చిన గోధుమలు నిరుపయోగంగా ఉన్నాయని, నాశనమయ్యాయని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌కు భారత దేశం ఎల్లప్పుడూ సహాయపడుతోందన్నారు.  


ఇదిలావుండగా, పాకిస్థాన్‌ను విమర్శించిన తాలిబన్ అధికారిని పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్థాన్‌కు మానవతావాద సాయంగా గోధుమలను గత నెలలో భారత ప్రభుత్వం పంపించింది. రెండో విడతలో 2,000 మెట్రిక్ టన్నుల గోధుమలు గురువారం అట్టారీ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌కు బయల్దేరాయి. మొత్తం 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపిస్తామని భారత్ ప్రకటించింది. వీటిని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య పథకంలో భాగంగా పంపిణీ చేస్తారు. 


Updated Date - 2022-03-05T20:47:16+05:30 IST