ఇళ్లల్లో పాత్రలు తోమి మమ్మల్ని పెంచారు

ABN , First Publish Date - 2022-12-31T04:50:05+05:30 IST

వందేళ్ల ప్రయాణంలో తన తల్లి హీరాబెన్‌ నిస్వార్థంగా జీవించారని, విలువలకు కట్టుబడిన ఆమె జీవితం ఓ తపస్సు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇళ్లల్లో పాత్రలు తోమి మమ్మల్ని పెంచారు

మా అమ్మ జీవిత ప్రయాణం ఓ తపస్సు

తల్లిని తలుచుకుంటూ మోదీ భావోద్వేగం

వందేళ్ల ప్రయాణంలో తన తల్లి హీరాబెన్‌ నిస్వార్థంగా జీవించారని, విలువలకు కట్టుబడిన ఆమె జీవితం ఓ తపస్సు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వందో జన్మదినం నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో కలవగా.. ‘‘మేధస్సుతో పనిచేయి. నిజాయతీగా పనిచేయి’’ అని సూచించారని వివరించారు. మాతృమూర్తి మరణం అనంతరం ఆమెను గుర్తుచేసుకుంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. తన తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి వద్దకు వెళ్లారని, తనలో త్రిమూర్తులు కొలువై ఉన్నట్లుగా భావిస్తానని మోదీ చెప్పుకొచ్చారు. కాగా, హీరాబెన్‌ వందో జన్మదినం సందర్భంగా ప్రధాని బ్లాగ్‌లో తల్లితో ఉన్న జ్ఙాపకాలను వివరించారు. ‘‘అమ్మ బాల్యం నుంచే కష్టాలను ఎదుర్కొంది. వాద్‌నగర్‌లో వర్షానికి నీళ్లు కారే చిల్లుల పెంకుల ఇంటిలో.. ఆ అతి సామాన్య జీవనంలోనూ మాకు వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంతో పాటు జీవిత పాఠాలను బోధించింది. అక్కడినుంచి దేశ ప్రధానిగా నా ఎదుగుదలలో అమ్మ ప్రభావం వర్ణించలేనిది. మమ్మల్ని పోషించేందుకు ఇతర ఇళ్లలో అంట్లు తోమింది. చరఖా తిప్పింది. ఇంటి దగ్గరకు వచ్చే పారిశుధ్య కార్మికులను టీ తాగకుండా వెళ్లనిచ్చేవారు కాదు. భవిష్యత్‌ గురించి అమ్మ ఆలోచన నాకు స్ఫూర్తిదాయకం. సగటు భారతీయ తల్లుల్లో ఉండే శ్రమించే తత్వం, నిస్వార్థం, సేవాతత్పరతను అమ్మ జీవితంలో చూశాను. తనలాంటి కోట్లాదిమంది మహిళలను చూస్తుంటే.. భారతీయ మహిళలకు అసాధ్యమనేది లేదని స్పష్టమవుతుంది’’ అంటూ ప్రధాని రాసుకొచ్చారు.

Updated Date - 2022-12-31T04:50:06+05:30 IST