కలిసి గెలిచాం
ABN , First Publish Date - 2022-08-08T06:26:24+05:30 IST
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సమాఖ్య వాణి బలంగా వినిపించింది. దేశంలో సహకార సమాఖ్య విధానం అమల్లో ఉండటం వల్లే కొవిడ్‌పై విజయం

సమాఖ్య స్ఫూర్తితోనే కొవిడ్‌పై విజయం సాధించాం
అదే స్ఫూర్తితో జీఎస్టీ వసూళ్లు పెంచాలి
సాగులో స్వయం సమృద్ధి సాధించాలి
ట్రేడ్, టూరిజం, టెక్నాలజీపై దృష్టిపెట్టండి
స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
వచ్చే 25 ఏళ్లకు ఇదే మన అజెండా
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ
మీ విధానాలను మాపై రుద్దొద్దు: మమత
ఉమ్మడి అంశాలపై రాష్ట్రాలను
సంప్రదించాలి: పినరయి విజయన్
ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించండి: మాన్
న్యూఢిల్లీ, ఆగస్టు 7: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సమాఖ్య వాణి బలంగా వినిపించింది. దేశంలో సహకార సమాఖ్య విధానం అమల్లో ఉండటం వల్లే కొవిడ్‌పై విజయం సాధించగలిగామని కేంద్రం పేర్కొంది. జీఎ్‌సటీ వసూళ్లు పెరగడానికి కూడా ఈ స్ఫూర్తే కారణమని తెలిపింది. మరోవైపు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పలు అంశాల్లో కేంద్రం వైఖరిని తప్పుబట్టాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై విధానాలు రూపొందించే విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సహకారం, సంప్రదింపులు అవసరమని పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల సీఎంలు పేర్కొన్నారు.
అలాగే... జీఎస్టీ పరిహారం గడువును ఇంకో ఐదేళ్లు పొడిగించాలని ఛత్తీస్‌గఢ్ పట్టుబట్టింది. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి తమకు ప్రత్యేకంగా నిధులు కావాలని ఒడిశా, ఝార్ఖండ్ డిమాండ్ చేశాయి. ఢిల్లీలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమావేశంలో ఛైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా పంటల వైవిధ్యం; పప్పులు, నూనెగింజలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించడం తదితర అంశాలపై దృష్టి సారించారు.
అలాగే పాఠశాల విద్య, ఉన్నత విద్యలో జాతీయ విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) అమలుచేయడం; పట్టణాల్లో పాలనపై చర్చించారు. ఈ అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ... దేశంలో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ హస్బెండరీ రంగాలను మరింత ఆధునీకరించాల్సి ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవటం ద్వారా వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని, ఈ విషయంలో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే వంటనూనెల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందన్నారు. అదేవిధంగా.... దేశంలో వేగంగా పట్టణీకరణ జరుగుతోందని, దీన్ని మన బ లంగా చూడాలి తప్ప బలహీనతగా చూడకూడదని అన్నారు.
జీఎస్టీ వసూళ్లు పెరగాలి...
ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యాల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. వీలైన చోటల్లా స్వదేశీ పరిశ్రమలు తయారుచేసిన వస్తువులనే ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనేది ఏ ఒక్క పార్టీకో చెందిన నినాదం కాదని, అందరి ఉమ్మడి లక్ష్యం ఇదేనని పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రాలు ట్రేడ్, టూరిజం, టెక్నాలజీ రంగాలపై మరింత దృష్టిపెట్టాలన్నారు. ఆయా రంగాల్లో దిగుమతులను తగ్గించుకుని, ఎగుమతులు పెంచడానికి కృషి చేయాలని ప్రధాని చెప్పారు. అలాగే... జీఎ్‌సటీ వసూళ్లను పెంచడానికి రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా కృషిచేయాలన్నారు. ఈ వసూళ్లు పెరిగినప్పటికీ.. ఇంకా పెంచడానికి అవకాశాలున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ‘5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ వసూళ్లు కీలకమని చెప్పారు. ఈ భేటీలో చర్చించిన అంశాలే రాబోయే 25 ఏళ్లకు (2047 వరకు) దేశానికి దిశానిర్దేశం చేస్తాయని ప్రధాని తెలిపారు. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లను, వారి ఆందోళనలను నీతి ఆయోగ్ పరిశీలించి, పరిష్కార మార్గాలను సూచిస్తుందన్నారు.
మీ విధానాలను మాపై రుద్దొద్దు: మమత
నీతి ఆయోగ్ సమావేశంలో పలు రాష్ట్రాలు తమ సమస్యలను, డిమాండ్లను కేంద్రానికి ఏకరువు పెట్టాయి. కేంద్రం తన విధానాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దకూడదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) అమలుచేయడంపై రాష్ట్రాలను ఒత్తిడి చేయవద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లను మరింత సీరియ్‌సగా కేంద్రం పట్టించుకోవాలన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ... ఉమ్మడి జాబితాలోని అంశాల విషయంలో కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లకూడదన్నారు. వాటిపై కేంద్రం చట్టాలు చేసేటప్పుడు రాష్ట్రాలను సంప్రదించాలన్నారు. కాగా... రాష్ట్రాలకు ఇస్తోన్న జీఎ్‌సటీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ డిమాండ్ చేశారు. నక్సల్స్‌ను ఏరివేయడానికి తమ రాష్ట్రం రూ.11,828 కోట్లు ఖర్చుపెట్టిందని, కేంద్రం ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని కోరారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ... కేంద్రం పరిధిలో ఉన్న టెలికాం, రైల్వేలు, బ్యాంకింగ్ రంగాల్లో అభివృద్ధి విషయంలో ఒడిశా వెనుకబడిందని, ఈ మేరకు తమ రాష్ట్రంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరారు.
ఝార్ఖండ్‌లో కరువును అధిగమించడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ సీఎం నీతీశ్ కుమార్ హాజరు కాలేదు. గత 20 రోజుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన నాలుగు సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు.
కొవిడ్‌పై విజయం మీదే..
కొవిడ్‌పై విజయం సాధించడంలో ఘనత రాష్ట్రాలకే దక్కుతుందని మోదీ అన్నారు. సహకార సమాఖ్య విధానాన్ని అనుసరించడం ద్వారా కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా ఈ సమస్యను అధిగమించగలిగాయని తెలిపారు. ఈ విషయం లో మన సమాఖ్య వ్యవస్థ ప్రపంచం మొత్తాని కి ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి చెం దుతున్న దేశాలు భారత్‌ను ఇప్పుడు గ్లోబల్ లీడర్‌గా చూస్తున్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా జీ-20 సమావేశాలు
2023లో జీ-20 దేశాల సమావేశం భారత్‌లో జరగనుందని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశాల నుంచి గరిష్ఠంగా ప్రయోజనం పొందడానికి రాష్ట్రాలు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇదే అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ... జీ-20 సమావేశాలు ఏడాది పొడవునా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతాయన్నారు. అలాగే... నూతన విద్యావిధానం అమలుకు కేంద్రం చేపట్టిన చర్యల గురించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కొవిడ్ కారణంగా హాజరుకాలేదు.