వేడెక్కుతున్న భారతం

ABN , First Publish Date - 2022-05-17T07:39:37+05:30 IST

భారత్‌లో వాతావరణం వేడెక్కుతోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగత్రలు 49 డిగ్రీలు దాటుతున్నాయి.

వేడెక్కుతున్న భారతం

ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు

గ్లోబల్‌ వార్మింగ్‌తో వాతావరణ మార్పులు

వడగాలులు, భారీ వర్షాలు, వరదలు

హెచ్చరిస్తున్న వాతావరణ నిపుణులు


న్యూఢిల్లీ, మే 16: భారత్‌లో వాతావరణం వేడెక్కుతోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగత్రలు 49 డిగ్రీలు దాటుతున్నాయి. వీటి ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలు వేడిగాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావానికి గురవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం ఢిల్లీలో 49 డిగ్రీలు, గురుగ్రామ్‌లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1966 మే తర్వాత ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి.   భారత్‌లో ముఖ్యంగా ఉత్తరాదిలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంపై వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాసియాలో గ్లోబల్‌ వార్మింగ్‌ ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఫలితంగా వేడి, తేమ శాతం పెరుగుతోందని, దీని కారణంగా భారత్‌లో వేడి గాలులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వాతావరణంలో విపరీత మార్పులకు దారితీస్తుందని, వేడిగాలులు, భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలులు వాతావరణ మార్పులకు సూచిక అని కశ్మీర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు అన్నారు. ఉత్తర భారతం ఎండ వేడిమితో అల్లాడుతుండగా.. దక్షిణాదిలోని కేరళ, లక్షద్వీప్‌ ఐలాండ్స్‌లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. కేరళలోని ఐదు జిల్లాలో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. తూర్పున అసోంలోని డిమా హసావో జిల్లాలో ఆకస్మిక వర్షాలతో వరదలు వచ్చాయి. భారత వాతావరణ శాఖ వద్ద ఉన్న డేటా ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో వాయువ్య, మధ్య భారతంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 122 ఏళ్ల రికార్డుని బ్రేక్‌ చేశాయి. సాధారణం నుంచి 4.5-6.4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాధారణం కంటే 6.4 డిగ్రీలకంటే అధికంగా నమోదైతే.. వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు పరిగణిస్తారు. ఈ పరిస్థితులు తలెత్తడానికి భారత్‌-పాకిస్థాన్‌ ప్రాంతంలో మానవ నిర్మిత కర్బన ఉద్గారాలు కారణంగా పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ కారణమని కశ్మీర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ చెప్పారు. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రత 1.2 డిగ్రీలు పెరిగిందని ప్రపంచ వాతావరణ మార్పుల నిపుణుడు హర్జీత్‌ సింగ్‌ వెల్లడించారు. వాతావరణంలో తీవ్రమైన మార్పు ల కారణంగా భారత ఉపఖండంలో లా నినాలు ఏర్పడతాయన్నారు. ఇది భారత్‌లోని వాతావరణ పరిస్థితులపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం 1992 నుంచి 2015 వరకు వడగాలుల దెబ్బకు దేశవ్యాప్తంగా 24 వేల మరణాలు సంభవించాయి.  

Updated Date - 2022-05-17T07:39:37+05:30 IST