గళమెత్తాలని యూదులకు జెలెన్‌స్కీ పిలుపు

ABN , First Publish Date - 2022-03-03T02:04:08+05:30 IST

రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

గళమెత్తాలని యూదులకు జెలెన్‌స్కీ పిలుపు

కీవ్ : రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ బుధవారం పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని యూదులు గళమెత్తాలని కోరారు. మౌనంగా ఉండిపోవద్దని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మారణహోమం జరిగిన కీవ్ నగరంలోని బాబి యార్‌పై రష్యన్ వైమానిక దళాలు మంగళవారం పెద్ద ఎత్తున దాడి చేసిన నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ పిలుపునిచ్చారు.  


జెలెన్‌స్కీ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో, ‘‘ఏం జరుగుతోందో మీరు చూడటం లేదా? నాజీయిజం నిశ్శబ్దంగా పుట్టింది. కాబట్టి సామాన్య ప్రజల హత్యలపై బిగ్గరగా అరవండి’’ అని విజ్ఞప్తి చేశారు. 


ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్, మరొక నగరం ఖార్కివ్‌లపై రష్యన్ దళాలు మంగళవారం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కీవ్‌లోని బాబి యార్ జిల్లాలో ప్రధాన టెలివిజన్ టవర్‌పై రష్యా దళాలు బాంబులు కురిపించాయి. దీంతో ఐదుగురు మరణించారు, ఐదుగురు గాయపడ్డారు. 


బాబి యార్‌లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మారణహోమం జరిగింది. 1941 సెప్టెంబరులో రెండు రోజులపాటు 30 వేల మందికి పైగా యూదులను నాజీ జర్మన్, ఉక్రెయిన్ అనుబంధ దళాలు హత్య చేశాయి. జర్మన్లు పాల్పడిన క్రూరమైన యుద్ధ నేరాల్లో ఇదొకటి. Updated Date - 2022-03-03T02:04:08+05:30 IST