లతా మంగేష్కర్ మృతి : ప్రగాఢ సంతాపం తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ABN , First Publish Date - 2022-02-06T17:17:52+05:30 IST

లతా మంగేష్కర్ మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు

లతా మంగేష్కర్ మృతి : ప్రగాఢ సంతాపం తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ : ‘భారత రత్న’ లతా మంగేష్కర్ మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, భారతీయ సినిమా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం తనను తీవ్ర విచారానికి గురి చేసిందన్నారు. 


మధురమైన, శ్రావ్యమైన, గంభీరమైన గళంతో అనేక దశాబ్దాలపాటు భారత దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికులను సమ్మోహనపరచిన లతా మంగేష్కర్ మరణంతో భారత దేశం తన గళాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. 


కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, లతా మంగేష్కర్ పాటలను అందరూ ఇష్టపడతారని, అదే విధంగా తనకు కూడా ఆమె పాటలు చాలా ఇష్టమని తెలిపారు. తనకు తీరిక దొరికినప్పుడల్లా ఆమె పాటలు వింటూ ఉంటానని చెప్పారు. ఈ కష్టకాలంలో ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 


ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇచ్చిన ట్వీట్‌లో, అనేక తరాలు ఆమె పాటలను ఆత్మీయంగా ఆదరించాయని తెలిపారు. ఆమె పాటలు ఎన్నటికీ నిలిచిపోతాయని చెప్పారు. ఆమె సంగీతానికి అంకితమై జీవించారన్నారు. ఆమె కుటుంబానికి, సంగీత ప్రేమికులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


Updated Date - 2022-02-06T17:17:52+05:30 IST