VAT : పెట్రో ఉత్పత్తులపై ఏపీ, తెలంగాణల్లో తగ్గని వ్యాట్
ABN , First Publish Date - 2022-12-16T00:57:35+05:30 IST
‘‘బీజేపీయేతర పార్టీల పాలనలోని ఆరు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్‌లలో పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గించలేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నాయి’’ అని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి
మరో నాలుగు రాష్ట్రాల్లోనూ తగ్గించలేదు
బీజేపీయేతర పార్టీల పాలనలోనే ఈ సమస్య
లోక్‌సభలో పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి
న్యూఢిల్లీ, డిసెంబరు 15: ‘‘బీజేపీయేతర పార్టీల పాలనలోని ఆరు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్‌లలో పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గించలేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నాయి’’ అని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలపై గురువారం లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దానిని అనుసరించి ప్రజాందోళనలను పరిగణనలోకి తీసుకొన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాయి. ప్రస్తుతం మన దేశంలోనే ఇంధనం ధరలు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధనం ధరల పెరుగుదలతో మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.27,276 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశ అవసరాల్లో 85ు క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే అంతర్జాతీయ మార్కెట్ ధరల హెచ్చు తగ్గుల ప్రభావం మనపై ఉంటోంది’’ అని మంత్రి హర్దీప్ సింగ్ వివరించారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష పార్టీలు.. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ సభ నుంచి వాకౌట్ చేశాయి.