బీజేపీని గెలిపించాలని మా కన్నా ప్రజలే ఎక్కువగా నిర్ణయించుకున్నారు : మోదీ

ABN , First Publish Date - 2022-02-11T19:42:10+05:30 IST

ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారని

బీజేపీని గెలిపించాలని మా కన్నా ప్రజలే ఎక్కువగా నిర్ణయించుకున్నారు : మోదీ

న్యూఢిల్లీ : ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో శుక్రవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, బీజేపీ రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుందని ఉత్తర ప్రదేశ్‌లో గురువారం జరిగిన తొలి విడత పోలింగ్ తర్వాత స్పష్టమైపోయిందని చెప్పారు. మంచి ఉద్దేశాలతో పని చేసేవారిని ఓటర్లు ఎన్నడూ వదిలిపెట్టరన్నారు. 


ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దేనని, ఈ అవకాశాన్ని వదిలిపెట్టవద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ఇటీవల రూ.17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని చెప్పారు. అన్ని కాలాలకు అనుకూలంగా ఉండే చార్‌ధామ్ రోడ్డు వల్ల తనక్‌పూర్-పితోరాగఢ్ సెక్షన్‌కు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉత్తరాఖండ్ ప్రజల శక్తి, సామర్థ్యాలు, సదుద్దేశాలు, నిజాయితీలను గుర్తించానన్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పర్వత మాల ప్రాజెక్టును ప్రతిపాదించామన్నారు. కొండ ప్రాంతాలకు రోప్‌వేలను నిర్మిస్తామన్నారు. ఆధునిక రహదారులను, రవాణా మౌలిక సదుపాయాలను నిర్మిస్తామని తెలిపారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 


Updated Date - 2022-02-11T19:42:10+05:30 IST