taiwan news : ఎలాంటి ప్రకటన లేకుండా తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా బృందం..
ABN , First Publish Date - 2022-08-15T01:33:53+05:30 IST
ఇటివల యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ‘తైవాన్ పర్యటన’ చైనాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

తైపీ : ఇటివల యూఎస్(USA) ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ(Nancy pelosi) ‘తైవాన్ పర్యటన’ చైనా(China)కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ కోపం చల్లారక ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా(America) చట్టసభ్యుల బృందం ఒకటి ఆదివారం తైవాన్(taiwan) చేరుకుంది. ముందుస్తుగా ఎలాంటి ప్రకటనా చేయకుండా ఈ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ‘‘ సెనేటర్ ఈడీ మార్కీ(డీ-ఎంఏ), రిప్రజెంటేటివ్స్ జాన్ గరామెండీ, అలెన్ లోయెంథల్, డాన్ బేయర్, అమువా అమటా కోలేమాన్య రెడేవాజెన్లు ఇండో-పసిఫిక్ పర్యటనలో భాగంగా ఆగస్టు 14-15, 2022 తేదీల్లో తైవాన్ను సందర్శించనున్నారు’’ అని తైవాన్‌లోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది. సీనియర్ తైవాన్ లీడర్లను కలవనున్నారని పేర్కొన్నారు. యూఎస్-తైవాన్ బంధాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ సప్లయ్ చెయిన్, వాతావరణ మార్పులతోపాటు పరస్పరం కీలకమైన అంశాలపై ఇరుదేశాలూ సంప్రదింపులు జరుపున్నారని తెలిపింది.
తైవాన్ స్పందన ఇదీ..
అమెరికా చట్టసభ్యుల పర్యటనను తైవాన్ విదేశాంగ శాఖ స్వాగతించింది. ఇరుదేశాల మధ్య బంధాలకు ఈ పర్యటన ప్రతీక అని పేర్కొంది. చైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నప్పటికీ అమెరికా బృందం పర్యటిస్తోందని, స్నేహబంధాన్ని చాటుకుంటోందని తైవాన్ విదేశాంగమంత్రి జోసెఫ్ వూ ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా నాన్సీ పెలోసి పర్యటనపై చైనా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తైవాన్ను చుట్టుముట్టి భారీ డ్రిల్స్ నిర్వహించింది. డ్రిల్స్‌లో భాగంగా కొన్ని క్షీపణులను కూడా ప్రయోగించిన విషయం తెలిసిందే. కాగా ఈ అప్రకటిత సందర్శన చర్చనీయాంశమైంది.