జెలెన్స్కీ దుస్తులపై ప్రశ్నించిన అమెరికా ఆర్థిక నిపుణుడు.. విరుచుకుపడుతున్న నెటిజన్లు
ABN , First Publish Date - 2022-03-18T22:12:28+05:30 IST
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ బుధవారం యూఎస్ కాంగ్రెస్ చట్ట సభ సభ్యులను ఉద్దేశించి

వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ బుధవారం యూఎస్ కాంగ్రెస్ చట్ట సభ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ప్రసంగ సమయంలో జెనెల్స్కీ ఆర్మీ గ్రీన్ టి-షర్ట్ ధరించడాన్ని అమెరికన్ ఆర్థిక నిపుణుడు ఒకరు తప్పుబట్టారు. అధ్యక్షుడి వేషధారణపై తీవ్ర విమర్శలు చేశారు. యూరో పసిఫిక్ కేపిటల్ చీఫ్ ఎకనమిస్ట్, గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అయిన పీటర్ షిఫ్ ట్విట్టర్లో జెలెన్స్కీని తీవ్రంగా విమర్శించారు.
ప్రస్తుతం పరిస్థితులు చాలా కఠినంగా ఉన్న విషయం తనకు తెలుసని, అయినప్పటికీ జెలెన్స్కీ సూటు ధరించి ఉండే బాగుండేదని అన్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రస్తుత సభ్యుల పట్ల తనకు పెద్దగా గౌరవం లేదని చెబుతూనే.. తానైతే టి-షర్ట్ ధరించి ప్రసంగించబోనని అన్నారు. సంస్థలను కానీ, యూఎస్‌ను కానీ అగౌరవపరచాలని తాను కోరుకోబోనని షిఫ్ అన్నారు. జెలెన్ స్కీ దుస్తులను ప్రశ్నించిన షిఫ్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
అలా ఎలా మాట్లాడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనిప్పుడు వార్ జోన్లో ఉన్నారని, మంచి దుస్తుల కోసం బీరువాను వెతికే సమయం ఇది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ట్వీట్లో యునైటెడ్ స్టేట్స్ అనే పదాన్ని కూడా సరిగా రాలేయలేదు, ఒకసారి చూసుకోమని సలహాలిస్తున్నారు. విమర్శలపై స్పందించిన పీటర్ షెఫ్.. జెలెన్స్కీ ఇప్పుడు యుద్ధభూమిలో లేరని, అంతేకాకుండా ప్రసంగం కోసం ఆయన తలదువ్వుకుని, చక్కగా ముస్తాబయ్యారని బదులిచ్చారు.
ఇలాంటి పిచ్చి కూతలు మానాలంటూ మరో యూజర్ కూడా షిఫ్‌ను కోరాడు. దానికి కూడా షిఫ్ బదులిస్తూ.. జెలెన్ స్కీ యుద్ధ భూమిలో లేకపోవడంతోపాటు సైనికులు టి-షర్టులు వేసుకుని ఫైట్ చేస్తారని తాను అనుకోనని అన్నారు. వారందరికీ ప్రత్యేకమైన యూనిఫామ్ ఉంటుందని సమాధానమిచ్చారు.