రష్యా గుండెలో.. ఆంక్షల గునపం!

ABN , First Publish Date - 2022-03-03T07:18:24+05:30 IST

ఉక్రెయిన్‌పై దాడి.. రష్యాను ఆర్థిక ఆంక్షల చట్రంలో బిగిస్తోంది. మిలిటరీపరంగా యుద్ధం చేయడం కాకుండా దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తేనే అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ దారికొస్తారని అమెరికా, బ్రిటన్‌, ఐరో పా దేశాలు గట్టిగా...

రష్యా గుండెలో.. ఆంక్షల గునపం!

  • ఇక ఆ దేశ ఆర్థికం కుదేలే!..
  • ఉక్రెయిన్‌పై దాడికి దిగగానే అమెరికా, ఐరోపా చర్యలు
  • బ్యాంకుల లావాదేవీల నియంత్రణ..
  • పుతిన్‌ సహా పలువురు రష్యన్ల ఆస్తుల స్తంభన

ఉక్రెయిన్‌పై దాడి.. రష్యాను ఆర్థిక ఆంక్షల చట్రంలో బిగిస్తోంది. మిలిటరీపరంగా యుద్ధం చేయడం కాకుండా దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తేనే అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ దారికొస్తారని అమెరికా, బ్రిటన్‌, ఐరోపా దేశాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. అందుకే ఆయన ఊహించని రీతిలో కలిసికట్టుగా ఆర్థిక ఆంక్షలు ప్రకటిస్తున్నాయి. రష్యాను ఏకాకిని చేసే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాయి. చివరకు ఆర్థికంగా తటస్థంగా ఉండే స్విట్జర్లాండ్‌, నార్వే, స్వీడన్‌, డెన్మార్క్‌ వంటి దేశాలు సైతం ఆంక్షల కొరడా ఝళిపించడం గమనార్హం.


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగుతుందని రెండు నెలల నుంచీ హెచ్చరికలు చేస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. తీరా దాడికి దిగగానే.. ఉక్రెయిన్‌కు మద్దతుగా తాము రష్యాతో యుద్ధానికి దిగేది లేదని తేల్చిచెప్పారు. అయితే ఆర్థికపరంగా మరిన్ని ఆం క్షలు ప్రకటించారు. రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంకు సహా రెండు పెద్ద బ్యాంకుల లావాదేవీలను స్తంభింపజేశారు. రష్యాకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఆయుధ, అంతరిక్ష సంస్థలపై ఆంక్షలు విధించారు. అన్ని రకాల ఎగుమతులు, దిగుమతులను నిషేధించారు. ఇదే బాటలో బ్రిటన్‌ కూడా పయనించింది. అది ఇంకో అడుగు ముం దుకేసి.. పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్‌ల ఆస్తులను స్తంభింపజేస్తున్నట్లు ప్రకటించింది. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలు కూడా ఏకగళంతో పలు ఆంక్షలు ప్రకటించాయి. రష్యా సేనలను నిలువరిస్తున్న ఉక్రెయిన్‌కు ఆయుధాలు, యుద్ధవిమానాలు, క్షిపణులు, య్ధు ట్యాంకులు సరఫరా చేస్తూనే.. అటు రష్యాను దౌత్యపరంగానే గాక ఆర్థికంగా దెబ్బతీసి దారికి తెచ్చేందుకు అనేక రకాల నియంత్రణలు విధిస్తున్నట్లు తెలిపాయి. ఉక్రెయిన్‌పై దాడికి దిగినప్పుడు తొలుత దాటవేత ధోరణిలో మాట్లాడిన ఈ దేశాలన్నీ అనూహ్యంగా ఏకతాటిపైకి వచ్చి తనపై ఆంక్షల యుద్ధాన్ని ప్రకటిస్తాయని పుతిన్‌ అస్సలు ఊహించలేదు. ఐరోపా ఆర్థిక వ్యవస్థలు తాను సరఫరా చేసే చమురు, గ్యాస్‌పై ఆధారపడి ఉన్నాయని.. ఆంక్షలకు అవి సాహసించలేవని ఆయన అనుకున్నారు. కానీ వాటి ఆంక్షలు.. యుద్ధం కంటే ఎక్కువగా ఆ దేశాన్ని దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అసలే సంక్షోభంలో..

ద్రవ్యోల్బణం పెరుగుదల, అధిక ధరలు, ద్రవ్య విధానం నియంత్రణ కారణంగా ఇప్పటికే రష్యా ఎకానమీ సంక్షోభంలో పడింది. ఇప్పుడు ఉక్రెయిన్‌ ఆక్రమణ దానిని మరింత అతలాకుతలం చేయనుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అమెరికా, బ్రిటన్‌, ఈయూ దేశాల ఆంక్షల కారణంగా.. ప్రస్తుతం రష్యా కరెన్సీ రూ బుల్‌ విలువ 29ు పడిపోయింది. డాలర్‌తో పోల్చితే దాని మారకం విలువ  పతనమైంది. పతనం ఆపడానికి రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంకు విదేశీ కరెన్సీ మార్కెట్‌లో జో క్యం చేసుకుని కోట్ల కొద్దీ రూబుల్స్‌ను కొనుగోలు చేసిం ది. అయితే ఇలా ఎంతో కాలం సాగదని నిపుణులు అం టున్నారు. వాస్తవానికి 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ను రష్యా ఆక్రమించి విలీనం చేసుకున్నప్పుడు కూడా అమెరికా, ఐరోపా దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అ యితే వాటి ప్రభావం పెద్దగా లేదు. అమెరికా డాలర్‌తో మారకం నుంచి నేరుగా ఆయా దేశాల కరెన్సీ మార్పిడి విధానానికి రష్యా శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో రష్యన్‌  సెంట్రల్‌ బ్యాంకు వేల కోట్ల డాలర్ల విలువ చేసే బంగారు నిల్వలను, విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకుంది. ఐరోపా దేశాలు అంత గట్టిగా ఆంక్షలు అమలు చేయకపోవడంతో అప్పట్లో అవి విఫలమయ్యాయి. అయితే ఇప్పుడు కలిసికట్టుగా రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. చమురు, గ్యాస్‌ తప్ప మిగతా రంగాల్లో ఆంక్షలు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు రష్యన్లు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. ఆర్థిక ఆంక్షలు రష్యాలోని అత్యంత ధనవంతులైన ఒలిగార్క్‌లపైనే కాకుండా అక్కడి సాధారణ పౌరులపైనా ప్రభావం చూపుతున్నాయి.


జీడీపీ వృద్ధి రేటు గతేడాది కంటే ఒక శాతం వరకు మందగించింది. బ్యాంకుల ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఇటీవలే రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది. ప్రతిరోజూ లక్ష కోట్ల డాలర్ల విలువైన లావాదేవీలు నిర్వహించే ‘స్విఫ్ట్‌’ బ్యాంకు క్లియరింగ్‌ సిస్టం నుంచి రష్యాకు చెందిన అత్యధిక బ్యాంకులను తొలగించింది. దీంతో రష్యన్లు విదేశాల్లోని తమ బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలు నిర్వహించలేరు. అయితే నేషనల్‌ బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్‌ ద్వారా దేశీయంగా లావాదేవీలు జరుపుకోవచ్చని.. విదేశీ బ్యాంకుల అనుబంధ సంస్థలు జారీ చేసే క్రెడిట్‌ కార్డులు రష్యాలో పనిచేస్తాయని సెంట్రల్‌ బ్యాంకు భరోసా ఇచ్చింది. అయినప్పటికీ తాజా ఆంక్షలతో దేశీయ కరెన్సీ మరింత పతనమవుతుందనే భయాలు నెలకొన్నాయి. రూబుల్‌ విలువ పతనంతో అటు దిగుమతుల వ్యయమూ భారీగా పెరుగుతోంది. ఉక్రెయిన్‌పై దాడికి ముందే రష్యాలో ద్రవ్యోల్బణం 8.7ు ఉంది. తాజా ఆంక్షలతో పరిస్థితి మరింత దిగజారనుంది. ప్రపంచంలో వినియోగిస్తున్న మైక్రోచి్‌పలలో 60ు వరకు సరఫరా చేస్తున్న తైవాన్‌ కూడా రష్యాపై ఆంక్షలు విధించేందుకు అంగీకరించింది. దీంతో రష్యా స్మార్ట్‌ ఫోన్‌, ఆటోమొబైల్‌ రంగాలు పతనమవుతాయి. ఔషధా ల్లో 66ు దిగుమతులపైనే రష్యా ఆధారపడింది. ఆంక్షల నేపథ్యంలో అవీ ఆగిపోతాయి. వీటన్నిటితో రష్యా మాంద్యంలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. 


చమురు, గ్యాస్‌ జోలికి వెళ్తారా?

ఈయూ దేశాలు అనేక రంగాల్లో రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు, గ్యాస్‌ విషయంలో మాత్రం తటపటాయిస్తున్నాయి. రోస్‌నెఫ్ట్‌, లుక్‌ఆయిల్‌, గజ్‌ప్రోమ్‌, టాట్‌నెఫ్ట్‌ వంటి భారీ రష్యన్‌ ఇంధన సంస్థలపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. దీనివల్ల ఆయా కంపెనీలు కొత్త షేర్ల జారీ గానీ, విక్రయం గానీ జరుపలేవు. అయితే సరఫరా మాత్రం యథావిఽధిగా జరుగుతుంది. ఇలాంటి ఆంక్షలకు జర్మనీ, ఫ్రాన్స్‌ సహా ఇతర ఈయూ దేశాలు సాహసించడం లేదు. వీటివల్ల చమురు, గ్యాస్‌ ధరలు పెరుగుతాయని.. అది తమ ఆర్థిక వ్యవస్థలకే దెబ్బని.. రష్యా ఆదాయం మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని.. అప్పుడు ఆంక్షల ఉద్దేశమే నెరవేరదని పేర్కొంటున్నాయి. స్విఫ్ట్‌ నుంచి రష్యన్‌ బ్యాంకులను తొలగించడంపైనా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అమెరికా ఒత్తి డి కారణంగా.. రష్యా నుంచి గ్యాస్‌పైపులైన్‌ ‘నార్డ్‌ స్ట్రీమ్‌- 2’ ప్రారంభాన్ని జర్మనీ వాయిదావేసినా అది తాత్కాలికమేనని అంటున్నారు. రష్యాపై ఆంక్షలను వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఏకపక్షంగా విధించిన ఆంక్షలకు చట్టబద్ధత లేదని చైనా బ్యాంకింగ్‌-ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ గువో షుకింగ్‌ తెలిపారు. ఇక రష్యాతో పాటు దానికి సహకరిస్తున్న బెలార్‌సపైనా బ్రిటన్‌ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. తన పోర్టుల్లోకి రష్యా నౌకల ప్రవేశాన్ని నిషేధించింది. రష్యన్‌ సెం ట్రల్‌ బ్యాంకు, రష్యా డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సంస్థలకు సంబంధించి బ్రిటన్‌లో ఉన్న ఆస్తులను స్తంభింపజేసింది. ఇంకోవైపు.. రష్యాపై ఆంక్షలు ఎంతవరకు పనిచేస్తున్నాయో నెల తర్వాత సమీక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. ఈలోపు ఇతర దేశాలతో సమన్వయం చేసుకుని మరిన్ని ఆంక్షల చట్రంలో రష్యాను బిగించి.. దారికి తెస్తామని ధీమా వ్యక్తంచేశారు. - సెంట్రల్‌ డెస్క్‌




Updated Date - 2022-03-03T07:18:24+05:30 IST