LIC : కేంద్రం సంచలన ప్రతిపాదనలు... ఎల్‌ఐసీ గురించి బ్లాస్టింగ్ న్యూస్...

ABN , First Publish Date - 2022-12-09T14:52:10+05:30 IST

ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది

LIC : కేంద్రం సంచలన ప్రతిపాదనలు... ఎల్‌ఐసీ గురించి బ్లాస్టింగ్ న్యూస్...
LIC

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భారతీయ జీవిత బీమా సంస్థ (Life Insurance Corporation of India)లో నాలుగు ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేసేందుకు ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన చట్టాలను సవరించేందుకు ప్రయత్నిస్తోంది. కాంపోజిట్ ఇన్సూరర్లకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఈ పరిణామాలను ఈ సంస్థల ఉద్యోగులు కూడా స్వాగతిస్తున్నారు.

బీమా రంగ నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కాంపోజిట్ ఇన్సూరర్లను అనుమతించాలని ప్రతిపాదించింది. జీవిత బీమా పాలసీలను, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆస్తులు, వాహనాలు వంటివాటి కోసం) పాలసీలను అమ్మే బీమా సంస్థనే కాంపోజిట్ ఇన్సూరర్ అంటారు. ఈ ప్రతిపాదనల అమలు కోసం ఇన్సూరెన్స్ యాక్ట్, 1938; ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్, 1999లలోని వివిధ నిబంధనలను సవరించాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రభుత్వ ప్రతిపాదనలు ఏమిటంటే, కాంపోజిట్ ఇన్సూరర్లను అనుమతించడం, అవసరమైన కనీస పెట్టుబడిని నిర్ణయించే అధికారాన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌కు కల్పించడం, చట్టపరమైన పరిమితులను రద్దు చేయడం, పెట్టుబడుల నిబంధనలను మార్చడం, కేప్టివ్స్, ఇతరులు సహా ఇతర రకాల ఇన్సూరర్లకు అనుమతి ఇవ్వడం.

స్ట్రాటజిక్ సెక్టర్స్‌లో నాలుగు పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఉండవచ్చునని, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్‌లో ఒకే ఒక ప్రభుత్వ యాజమాన్యంలోని యూనిట్ ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గతంలో చేసిన ప్రకటనను బీమా రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రకటనకు అనుగుణంగా ప్రభుత్వం తన నాలుగు నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఎల్ఐసీలో విలీనం చేయవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఆ కంపెనీలు ఏమిటంటే... ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ నాలుగు కంపెనీల ఉద్యోగ సంఘాలు కూడా ఈ పరిణామాలను స్వాగతిస్తున్నాయని చెప్తున్నారు. ఏకైక బలమైన సంస్థగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC Re), ECGC Ltd, Agriculture Insurance Conpany of India Ltd. వీటిలో GIC Re అనేది నేషనల్ రీఇన్సూరర్ కాగా, ECGC, వ్యవసాయ బీమా కంపెనీలు స్పెషలైజ్డ్ బిజినెస్ యూనిట్లు. వ్యవసాయ బీమా కంపెనీని కూడా తర్వాతి దశలో ఎల్ఐసీలో విలీనం చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆలిండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ త్రిలోక్ సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను బలోపేతం చేసే చర్యలను తాము స్వాగతిస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-12-09T15:15:27+05:30 IST