ఉక్రెయిన్‌కు ప్రపంచం అండదండలు కావాలి : జెలెన్‌స్కీ సతీమణి ఓలెనా

ABN , First Publish Date - 2022-03-05T23:24:17+05:30 IST

ఉక్రెయిన్‌కు ప్రపంచం అండదండలు, సహకారం అవసరమని ఆ దేశాధ్యక్షుని

ఉక్రెయిన్‌కు ప్రపంచం అండదండలు కావాలి : జెలెన్‌స్కీ సతీమణి ఓలెనా

కీవ్ : ఉక్రెయిన్‌కు ప్రపంచం అండదండలు, సహకారం అవసరమని ఆ దేశాధ్యక్షుని సతీమణి ఓలెనా జెలెన్‌స్కా చెప్పారు. తమ దేశానికి అవసరమైనది రక్షణ పొందడం కాదన్నారు. తమ ప్రజలకు, సైన్యానికి ప్రపంచ మద్దతు అవసరమని తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ఆమె వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఓ టెలిగ్రామ్ చానల్‌ను ప్రారంభించారు. 


ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మాదిరిగానే ఆయన సతీమణి, దేశ ప్రథమ మహిళ ఓలెనా జెలెన్‌స్కా కూడా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. తమ దేశంపై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత యథార్థాలను తెలియజేయడమే లక్ష్యంగా ఆమె ఓ టెలిగ్రామ్ చానల్‌ను ప్రారంభించారు. యుద్ధం సమయంలో ఎలా ఉండాలో ఆమె వివరిస్తున్నారు. తమకు చాలా ప్రశ్నలు ఉన్నాయని, తనకు చేతనైనంతగా సాయపడాలని అనుకుంటున్నానని చెప్పారు. 


ఉక్రెయిన్‌కు ఏ విధంగా సాయపడాలో చెప్పాలని తనను ప్రపంచంలోని వివిధ దేశాల ప్రథమ మహిళలు అడుగుతున్నారని ఓలెనా చెప్పారు. ప్రపంచానికి సత్యం, నిజం చెప్పాలని తాను చెప్పానని తెలిపారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్నది రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ చెప్తున్నట్లుగా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కాదని, ఇది పూర్తి స్థాయిలో జరుగుతున్న యుద్ధమని తెలిపారు. దురాక్రమణదారు రష్యన్ ఫెడరేషన్ అని చెప్పారు. ఈ నిజాలు చెప్పడానికి గళమెత్తాలని పిలుపునిచ్చారు. 


ఉక్రెయిన్‌కు అవసరమైనది రక్షింపబడటం కాదన్నారు. తమ సైన్యానికి, ప్రజలకు ప్రపంచం నుంచి అండదండలు అవసరమని చెప్పారు. ఆ మద్దతు కేవలం మాటల్లో ఉండకూడదని చెప్పారు. 


2003లో వివాహం

వోలోడిమిర్ జెలెన్‌స్కీ రాజకీయాల్లోకి రాక పూర్వమే 2003లో ఓలెనాతో వివాహం జరిగింది. వీరిద్దరూ ఓ కళాశాలలో కలుసుకున్నారు. వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఓ ప్రొడక్షన్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఓలెనా జెలెన్‌స్కా స్క్రిప్ట్ రైటర్‌గా మారారు. ‘సర్వెంట్ ఆఫ్ పీపుల్’కు ఆమె స్క్రిప్ట్ రచయిత్రి. 


Updated Date - 2022-03-05T23:24:17+05:30 IST