‘ఉక్కు’పై యుద్ధ మేఘాలు!

ABN , First Publish Date - 2022-03-05T07:41:37+05:30 IST

ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం రాష్ట్రంలోని నిర్మాణదారులకు పెద్ద షాక్‌ ఇచ్చింది. గత ఐదురోజుల్లో రోజుకు రెండువేల చొప్పున స్టీల్‌ ధర పెరిగింది. ...

‘ఉక్కు’పై యుద్ధ మేఘాలు!

టన్ను రూ.75 వేలకు చేరిక.. 5 రోజుల్లో 10 వేల పెంపు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో

తెగిపోయిన సరఫరా చైన్‌

దీంతో భారీగా పెరిగిన స్టీల్‌ ధర

రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన నిర్మాణాలు

లబోదిబో మంటున్న బిల్డర్లు

పనులు లేక కార్మికుల విలవిల

నిర్మాణం సాగించలేక.. ఆపుకోలేక

మధ్యతరగతి పరిస్థితి దారుణం


ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం తాలూకు ప్రభావం మనపై ఉంటుందా? అక్కడెక్కడో యుద్ధం జరిగితే.. ఇక్కడ ఏం జరుగుతుందిలే.. అనుకున్నారా? అయితే.. అక్కడ యుద్ధం తాలూకు ప్రభావం ఇక్కడ ‘ఉక్కు’పై బలంగా పడింది. ఉక్కు సరఫరా చైన్‌ తెగిపోవడంతో ఒక్కసారిగా పెరిగిన స్టీల్‌ ధరలు నిర్మాణదారుల నడ్డివిరిచేస్తున్నాయి. గత 5 రోజుల్లో టన్నుకు ఏకంగా రూ.10 వేల చొప్పున ధర పెరగడంతో కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం రాష్ట్రంలోని నిర్మాణదారులకు పెద్ద షాక్‌ ఇచ్చింది. గత ఐదురోజుల్లో రోజుకు రెండువేల చొప్పున స్టీల్‌ ధర పెరిగింది. ఈ కొద్దిరోజుల్లోనే ఏకంగా టన్నుకు రూ.10 వేలు పెరగడంతో ఇళ్లు కట్టుకునే మధ్యతరగతి ప్రజలు తలపట్టుకున్నారు. అపార్ట్‌మెంట్లు నిర్మించే నిర్మాణదారులైతే నిర్మాణాలను దాదాపు నిలిపివేశారు. కొన్నిచోట్ల నిర్మాణాల వేగం తగ్గించారు. స్టీల్‌ ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణం.. ఉక్కు తయారీకి ఉపయోగించే కీలక ముడి పదార్థం ‘కోకింగ్‌ కోల్‌’ ధర పెరిగిపోవడం, యుద్ధం వల్ల సరఫరా చైన్‌ దెబ్బతినడమేనని ఐరన్‌ డీలర్లు చెబుతున్నారు. మూడేళ్ల కిందట టన్ను రూ.45 వేలు ఉండగా.. యుద్ధానికి ముందునాటికే రూ.65 వేలకు చేరింది. అప్పటికే ఆపసోపాలు పడుతున్న నిర్మాణదారులు.. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో కేవలం ఐదు రోజుల్లోనే టన్నుకు మరో రూ.10 వేలు పెరిగిపోవడంతో నిర్మాణాలను ఆపేయడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి వచ్చేసింది. 


గత ఐదు రోజుల నుంచీ..

ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణదారుల పరిస్థితి ముందుకెళ్తే గొయ్యి.. వెనక్కెళ్తే నుయ్యి అన్నట్లుగా మారింది. సొంతిళ్లు నిర్మించుకునేవారి నుంచి రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణదారుల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు ధరలు పెరిగినా.. అప్పో సప్పో చేసి నిర్మాణాలను కొనసాగిస్తున్న వారు గత ఐదురోజుల నుంచి ఇక, ఉక్కు కొనే పరిస్థితి లేకపోవడంతో కాడి వదిలేశారు. అయితే, ఇలా ఎంతకాలం ఆపేసుకుని కూర్చోవాలనేది ప్రధాన ప్రశ్న. నిర్మాణాలు ఆపేసినా నిర్వహణ ఖర్చులు తప్పవు. ఆలస్యం అయ్యేకొద్దీ వడ్డీల భారం అధికమైపోతుంది. అలాగని ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచని దుస్థితిలో ఉన్నామని నిర్మాణదారులు వాపోతున్నారు. ఇక నిర్మాణదారుల పరిస్థితి అంతకంటే ఘోరం. ‘‘మేం ఒక అపార్ట్‌మెంట్‌ నిర్మాణాన్ని మూడేళ్ల క్రితం ప్రారంభించినప్పుడు లారీ ఇసుక రూ.4 వేలు. ప్రభుత్వం మారాక అదే లారీ ఇసుకను రూ.40 వేలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. సిమెంటు ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. స్టీల్‌ అప్పట్లో టన్ను రూ.45 వేలుంటే ఇప్పుడు రూ.65 వేలకు చేరింది. ఉక్రెయిన్‌ యుద్ధ పేరుతో రూ.10 వేలు పెంచేశారు. కానీ, ప్రభుత్వ విధానాల వల్ల మేం అమ్మే ఫ్లాట్ల ధర మాత్రం పెరగలేదు. నష్టం రాకుండా గట్టెక్కితే చాలు. ఇక, మళ్లీ కొత్త నిర్మాణాలు చేయకూడదనే గట్టి నిర్ణయానికి వచ్చేశాం’’ అని విజయవాడకు చెందిన బిల్డర్‌ మైనేని సాయిబాబా వాపోయారు. దీనికితోడు నష్టాలొచ్చినా, టర్నోవర్‌పై ఆదాయపు పన్ను, జీఎ్‌సటీ అంటూ ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయని లబోదిబోమంటున్నారు. పెరిగిన ఉక్కు ధరలతో నిర్మాణాలు నిలిచిపోయే పరిస్థితి రావడం.. బిల్డర్లకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రంగంపై ఆధారపడిన దాదాపు 30లక్షల మంది భవన నిర్మాణ కార్మికులపనై ప్రభావం పడింది.


పేదలపై స్టీలు భారం

 టన్ను రూ.72-75 వేలకు హౌసింగ్‌ శాఖ టెండర్లు ఖరారు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): పేదలు నిర్మించుకుంటున్న పక్కా ఇళ్లపై స్టీలు భారం భారీగా పెరిగింది. ఇప్పటివరకూ టన్ను స్టీలు రూ.62వేల నుంచి రూ.64 వేల మధ్య జిల్లాలవారీగా వేర్వేరు ధరలకు స్టీలు కంపెనీలు పేదలకు సరఫరా చేస్తున్నాయి. తాజాగా గృహనిర్మాణశాఖ పిలిచిన టెండర్లలో టన్ను ధరను రూ.75వేలకు పైగా కోట్‌ చేశాయి. చివరికి రూ.72వేల నుంచి రూ.75వేల మధ్య సరఫరా చేసేలా హౌసింగ్‌ ఒప్పందం చేసుకుని శుక్రవారం టెండర్లు ఖరారుచేసింది. దీంతో పేదలపై ఒకేసారి టన్నుకు భారీ భారం పడనుంది. ఒక్కో ఇంటికి దాదాపు అరటన్ను స్టీలును హౌసింగ్‌ ఇస్తోంది. అంటే ఒక్కో ఇంటిపై ఇప్పుడు దాదాపు రూ.5వేలు అదనపు భారం పడనుంది. 

Read more