Udayanidhi Stalin: కొత్తమంత్రికి యువజన శాఖ

ABN , First Publish Date - 2022-12-15T08:07:52+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) తనయుడు, చేపాక్‌-ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో

Udayanidhi Stalin: కొత్తమంత్రికి యువజన శాఖ

- పదిమంది మంత్రుల శాఖల మార్పు

- పెరియస్వామికి గ్రామీణాభివృద్ధి శాఖ

- రామచంద్రన్‌కు పర్యాటకం

- శేఖర్‌బాబుకు అదనంగా నగరాభివృద్ధి శాఖ

చెన్నై, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) తనయుడు, చేపాక్‌-ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పదిమంది మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చేర్పులు జరిగాయి. ఉదయనిధి(Udayanidhi)కి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధిశాఖ అప్పగించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సిఫార్సులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదించారు. దాంతో తక్షణం ఈ మార్పులు అమలులోకి వచ్చాయి. ఆ మేరకు మంత్రులు పెరియస్వామి, కేకే ఆర్‌ పెరియకరుప్పన్‌, కె.రామచంద్రన్‌, శివ వి.మెయ్యనాధన్‌, డాక్టర్‌ ఎం.మదివేందన్‌ శాఖలను మార్పు చేశారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి ఐ.పెరియస్వామిని ఆ శాఖ నుంచి తప్పించి, గ్రామీణ, నగరాభివృద్ధి శాఖ అప్పగించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేకేఆర్‌ పెరియకరుప్పన్‌కు సహకార శాఖ అప్పగించారు. అటవీశాఖ మంత్రి కె.రామచంద్రన్‌(Forest Minister K. Ramachandran)కు పర్యాటక శాఖ, ఇప్పటి వరకు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్‌ ఎం.మదివేందన్‌కు అటవీశాఖను అప్పగించారు. పర్యాటక, పర్యావరణ, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి శివ వి.మెయ్యనాథన్‌ను పర్యాటక, కాలుష్యనియంత్రణ శాఖలకు పరిమితం చేశారు. అదే విధంగా పర్యాటక శాఖను మంత్రి కె.రామచంద్రన్‌కు అప్పగించారు. గృహనిర్మాణ, నగరాభివృద్ధి శాఖ మంత్రి కె.ముత్తుస్వామికి అదనంగా గ్రామీణ గృహసదుపాయం, నగర ప్రణాళిక శాఖలను కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజకన్నప్పన్‌కు ఎంబీసీల సంక్షేమ, గ్రామీణ పరిశ్రమల శాఖలను అదనంగా కేటాయించారు. ఖద్దరు, చేనేత శాఖల మంత్రి ఆర్‌.గాంధీకి అదనంగా భూదానం, గ్రామదానం శాఖలను అప్పగించారు. హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబుకు అదనంగా నగరాభివృద్ధి శాక అప్పగించారు. ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌కు అదనంగా గణాంకాల శాఖ కేటాయించారు.

Updated Date - 2022-12-15T08:07:54+05:30 IST