నూపుర్ శర్మ స్టాటస్ పెట్టుకున్న వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-06-29T00:33:34+05:30 IST
నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను షేర్ చేసిన ఓ యువకుడు..

ఉదయ్‌పూర్: నూపుర్ శర్మకు మద్దతుగా కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను షేర్ చేసిన ఓ వ్యక్తి మంగళవారంనాడు దారుణ హత్యకు గురయ్యాడు. టైలర్ వృత్తి చేస్తున్న అతనిని ఇద్దరు అగంతకులు తలనరికి మరీ చంపారు. ఉదయ్‌పూర్‌లోని మాల్డాస్ స్ట్రీట్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాల్డాస్ స్ట్రీట్ ప్రాంతంలోని దుకాణాలన్నీ మూసేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అదనంగా 600 మంది పోలీసులను ఆ ప్రాంతానికి తరలించారు. మరోవైపు, ఈ దారుణానికి పాల్పడిన అగంతకులు ఆ హత్యను స్వయంగా వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యను గొప్పగా చెప్పుకోవడంతో పాటు ప్రధాని మోదీకి కూడా ఇదే గతి పడుతుందంటూ ఆ వీడియోలో హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఉదయ్‌పూర్ ఎస్పీ మాట్లాడుతూ, ఇది అత్యంత కిరాతకమైన హత్య అని, దీనిపై తాము దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. పలువురు నిందితులను గుర్తించామని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ చర్యకు తామే పాల్పడినట్టు చెబుతూ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రశాంతంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి
కాగా, ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తతలు తలెత్తడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెంటనే స్పందించారు. ఉదయ్‌కుమార్‌లో ఒక యువకుని అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, వీడియోను ఎవరికీ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.