Maharashtra : వరద ప్రవాహానికి ఎదురెళ్లి ఓ వ్యక్తిని కాపాడిన ఇద్దరు పోలీసులు
ABN , First Publish Date - 2022-07-10T15:51:37+05:30 IST
వరద ప్రవాహం ఉద్ధృతిని ఎదిరించి ఇద్దరు పోలీసులు ఓ వ్యక్తిని కాపాడిన

ముంబై : వరద ప్రవాహం ఉద్ధృతిని ఎదిరించి ఇద్దరు పోలీసులు ఓ వ్యక్తిని కాపాడిన వీడియోను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత సుప్రియ సూలే (Supriya Sule) షేర్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ కానిస్టేబుళ్ళను అందరూ ప్రశంసిస్తున్నారు.
కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు ఉవ్వెత్తున ఎగసిపడుతూ, పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని పుణే (Pune), శివానే (Shivane) సమీపంలోని బగుల్ ఉదయన్ గ్రామంలో వరద ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండటాన్ని పోలీసు కానిస్టేబుళ్లు అజిత్ పోకరే, సద్దామ్ షేక్ గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రవాహంలోకి దూకి, ఆ వ్యక్తిని కాపాడారు. వారు తమ ప్రాణాలను లెక్క చేయకుండా మానవత్వాన్ని ప్రదర్శించారు.
సుప్రియ సూలే ఇచ్చిన ట్వీట్లో, పుణే పోలీస్ కానిస్టేబుళ్ళు అజిత్ పోకరే, సద్దామ్ షేక్ శివానేలోని బగుల్ ఉదయన్ గ్రామంలో ఓ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారని, వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ధైర్యసాహసాలను ప్రదర్శించారని తెలిపారు. వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమన్నారు. మహారాష్ట్ర పోలీసులు గర్వకారణంగా నిలిచారని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ పోలీసు కానిస్టేబుళ్ళ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్ని జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు. వర్షాల వల్ల ఎదురవుతున్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో 17 బృందాలను మోహరించింది.