పాసింజర్ రైలులో మంటలు..రెండు బోగీలు దగ్ధం

ABN , First Publish Date - 2022-03-05T20:47:22+05:30 IST

షహరాన్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ ట్రైనులో శనివారం ఉదయం అగ్నిప్రమాదం..

పాసింజర్ రైలులో మంటలు..రెండు బోగీలు దగ్ధం

మీరట్: షహరాన్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ ట్రైనులో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని దౌరాల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బోగీలు దగ్దం కాగా, తక్కిన బోగీలకు మంటలు విస్తరించకుండా ఇంజన్ నుంచి  వాటిని సెపరేట్ చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. 04460-షహరాన్‌పూర్ ఢిల్లీ జంక్షన్ ఎంఇఎంయూ స్పెషల్‌లోని ఒక కోచ్‌లో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. మంటలను ఆర్పివేశామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వైకే ఝా తెలిపారు.


భారీ ప్రమాదం జరక్కుండా ప్రయాణకులు కిందకు దిగి ఇంజన్, మంటల్లో చిక్కుకున్న బోగీల నుంచి ఇతర బోగీలను వేరుచేశారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో షహరాన్‌పూర్ బయలుదేరిన రైలు దౌరాలా స్టేషన్ సమీపానికి వచ్చేసరికి ఒక కంపార్ట్‌మెంట్‌లో మంటలు వచ్చాయని, 7.10 గంటలకు దౌరాలా స్టేషన్‌కు వచ్చేసరికి రెండు బోగీలు మంటల్లో కాలిపోయాయని మీరట్ సిటీ రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఆర్‌పీ శర్మ తెలిపారు. మంటలు చెలరేగిన బోగీల నుంచి ఇతర బోగీలను ప్రయాణికులు సెపరేట్ చేసి, సురక్షితంగా అంతా బయటపడినట్టు చెప్పారు. అనంతరం రెండు బోగీల్లోని మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చినట్టు తెలిపారు.

Updated Date - 2022-03-05T20:47:22+05:30 IST