No to great leader : జీ జిన్‌పింగ్‌ను గద్దె దించాలంటూ చైనాలో బ్యానర్లు

ABN , First Publish Date - 2022-10-14T23:48:47+05:30 IST

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గద్దె దించాలంటూ బీజింగ్‌లో రెండు

No to great leader : జీ జిన్‌పింగ్‌ను గద్దె దించాలంటూ చైనాలో బ్యానర్లు

బీజింగ్ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గద్దె దించాలంటూ బీజింగ్‌లో రెండు బ్యానర్లు వెలిశాయి. కఠినమైన కోవిడ్ ఆంక్షల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు ఆహారం, స్వేచ్ఛ అవసరమని, అబద్ధాలు, సాంస్కృతిక విప్లవం అక్కర్లేదని వీటిలో ఉంది. బీజింగ్‌లోని సైటోంగ్ ఫ్లైఓవర్‌పై ఈ రెండు బ్యానర్లను ఏర్పాటు చేశారు. 


చైనా అధ్యక్షునిగా మూడోసారి జీ జిన్‌పింగ్ నియమితుడయ్యే అవకాశం ఉంది. ఈ నెల 16న ఆయన పునర్నియామకం జరగవచ్చు. ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పరిపాలనను వ్యతిరేకిస్తూ రెండు బ్యానర్లను ఏర్పాటు చేశారు. 


‘‘కోవిడ్ పరీక్ష వద్దు, ఆహారం కావాలి. అష్టదిగ్బంధనం వద్దు, స్వేచ్ఛ కావాలి. అబద్ధాలు వద్దు, గౌరవ, మర్యాదలు కావాలి. సాంస్కృతిక విప్లవం వద్దు, సంస్కరణలు కావాలి. మహా నేత అక్కర్లేదు, ఎన్నికలు జరగాలి. బానిసగా ఉండకండి, పౌరునిగా జీవించండి’’ అని ఓ బ్యానర్లో ఉంది. 


మరో బ్యానర్లో, ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్రోహి జీ జిన్‌పింగ్‌ను తొలగించండి’’ అని ఉంది. ఈ రెండు బ్యానర్ల ఫొటోలు, వీడియోలు చైనీస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యానర్లు చైనీయుల్లో ఓ ఊపు తీసుకొచ్చాయి. జీ జిన్‌పింగ్ నియంతృత్వ పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది. 


ఇదిలావుండగా, ఈ వార్తలను చైనా అధికారులు ఖండించారు. అటువంటి బ్యానర్ల ఏర్పాటు జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ బ్యానర్ల జాడ కనిపించకుండా చైనీస్ సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. అయితే పాశ్చాత్య సామాజిక మాధ్యమాల్లో ఈ బ్యానర్ల ఫొటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి. కొన్ని చైనీస్ ట్విటర్ అకౌంట్లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. 


జీ జిన్‌పింగ్ 2012లో అధికారం చేపట్టారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయన కఠిన ఆంక్షలను అమలు చేశారు. లక్షలాది మందిని క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 


Updated Date - 2022-10-14T23:48:47+05:30 IST