ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకం
ABN , First Publish Date - 2022-08-01T07:49:47+05:30 IST
దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
రేపటి నుంచి సోషల్ మీడియాలో పెట్టండి
13-15 మధ్య ఇంటింటా జాతీయ జెండా
మన్ కీ బాత్‌లో ప్రజలకు మోదీ పిలుపు
మేడారం, మరిడమ్మ జాతరల ప్రస్తావన
పింగళి జాతీయ జెండాలో ఆత్మాభిమానం
రేపు ఢిల్లీలో 146వ జయంతి వేడుకలు
పింగళి కుటుంబ సభ్యులకు నరేంద్ర మోదీ సత్కారం
భట్లపెనుమర్రులో స్మృతివనం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 31: దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ అమృత మహోత్సవాల సందర్భంగా ఆగస్టు 2-15వ తేదీల మధ్య ప్రతి ఒక్కరూ దీనిని పాటించాలన్నారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జన్మదినం ఆగస్టు 2న అని ప్రధాని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్యకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. అలాగే, ఆగస్టు 13-15 మధ్య దేశంలోని ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని మోదీ ఆకాంక్షించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా నిర్వహించుకుంటున్న అమృత మహోత్సవాల వేడుక ప్రజా ఉద్యమంగా అవతరిస్తోందని తెలిపారు.
దేశంలోని అ న్ని సామాజిక వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమం లో భాగంగా ఆదివారం ప్రధాని మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం సాధించి ఆగస్టు 15నాటికి 75 ఏళ్లు పూర్తవుతుండడం ఒక చరిత్రాత్మక సందర్భమని పేర్కొన్నా రు. ఇలాంటి గొప్ప సందర్భాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతున్న ప్రస్తుత తరం ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పారు. ‘‘బానిసత్వకాలంలో మనం జన్మించి ఉంటే ఈ రోజు (ఆగస్టు 15)ను ఊహించుకోగలిగే వాళ్లమా? ఆజాదీకా అమృత మహోత్సవాల సందేశం ఒకటే.. ప్రజలందరూ పూర్తి నిబద్ధతతో, తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. అప్పుడే స్వాతంత్య్ర సమర యోధుల కలలను మనం నిజం చేయగలం. వారి ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని నిర్మించుకోగలం’’ అని ప్రధాని అన్నారు. వచ్చే 25ఏళ్ల అమృత కాలాన్ని ‘కర్తవ్యకాలం’గా భావించి ప్రజలందరూ దేశం పట్ల తమ బాధ్యతలను నెరవేర్చాలని సూచించారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉధం సింగ్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఘనంగా నివాళులర్పించారు.

మేడారం, మరిడమ్మ జాతరల ప్రస్తావన
మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లోని జాతరల ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు. తెలంగాణలోని మేడారం, తూర్పు గోదావరి జిల్లాలోని మరిడమ్మ జాతరలు ఆదివాసీల విశ్వాసాలకు అత్యంత ముఖ్యమైనవని, ఈ వేడుకలకు ప్రజలు తప్పకుండా హాజరుకావాలని పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఆదివాసీలకు సంబంధించిన అనేక జాతరలు ఉన్నాయి. మీకు అవకాశం దొరికితే తెలంగాణలోని మేడారంలో నాలుగు రోజులపాటు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను తప్పకుండా సందర్శించండి. ఈ జాతరను తెలంగాణ మహాకుంభమేళాగా పిలుస్తారు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల కోయ ఆదివాసీ సమాజానికి కూడా అతిపెద్ద విశ్వాస కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌లోని మరిడమ్మ జాతర కూడా ఆదివాసీ సమాజం విశ్వాసాలకు సంబంధించిన అతిపెద్ద జాతర. ఆదివాసీ సమాజం శక్తి, భక్తి, ఆరాఽధనలకు ఈ జాతర అనుసంధానంగా నిలుస్తుంది. తూర్పుగోదావరిలోని పెద్దాపురంలో మరిడమ్మ గుడి కూడా ఉంది.’’ అని ప్రధాని వివరించారు. యువత తప్పనిసరిగా ఈ జాతరలకు వెళ్లాలని కోరారు. ఇలాంటి జాతరలకు వెళ్లినప్పుడల్లా అక్కడి దృశ్యాలను ప్రత్యేకమైన హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి సోషల్ మీడియాలో పంచుకోవాలన్నారు. దీంతో జాతరల గురించి ఇతరులకు తెలుస్తుందన్నారు. త్వరలో సాంస్కృతిక శాఖ ఒక పోటీని ప్రారంభించబోతోందని, జాతరలకు సంబంధించిన ఉత్తమ చిత్రాలను పంపిన వారికి బహుమతులను కూడా అందజేస్తామని ప్రధాని తెలిపారు.

స్వతంత్ర పోరాటంలో భారతీయ రైల్వేల ప్రాముఖ్యాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటి పోరాటంలో ముఖ్యపాత్ర పోషించిన 24 రాష్ట్రాల్లోని 75 రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దామని, ప్రజలందరూ ఆయా స్టేషన్లను సందర్శించాలని ప్రధాని కోరారు. భారతీయ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి లో సత్తా చాటుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇటీవల సింగపూర్ ఓపెన్ సాధించిన పీవీ సింధు, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో రజతం గెలుచుకున్న నీర జ్ చోప్రా విజయాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్రిటన్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. త్వరలో జరగనున్న మహిళల అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు భారత్ వేదిక కావడం పట్ల ప్రధాని సం తోషం వ్యక్తం చేశారు. మరింత మం ది అమ్మాయిలు క్రీడలపై ఆసక్తి చూపించేందుకు ఇది తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన్‌కీబాత్‌లో భాగం గా దేశంలో బొమ్మల పరిశ్రమ అభివృద్ధిని ప్రధాని కొనియాడారు. దేశంనుంచి బొమ్మల ఎగుమతుల విలువ రూ.300-400 కోట్లనుంచి స్వల్పకాలంలోనే రూ.2600 కోట్లకు చేరుకుందని, ఇది ఊహకు అందని విజయమన్నారు. గతంలో భారత్ రూ.300 కోట్ల విలువైన బొమ్మలను దిగుమతి చేసుకునేదని, ఈ దిగుమతులు 70 శాతం వరకు తగ్గాయని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో కృషి చేస్తున్న కంపెనీలను ప్రధాని అభినందించారు. మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రసంగం అనంతరం హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ప్రధాని పిలుపు మేరకు ప్రజలంతా తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను ఉంచాలన్నారు.
