2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ: మమత

ABN , First Publish Date - 2022-02-02T22:44:00+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ (టీఎంసీ) మద్దతు సమాజ్‌వాదీ పార్టీకి ఇస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ ..

2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ: మమత

కోల్‌కతా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ (టీఎంసీ) మద్దతు సమాజ్‌వాదీ పార్టీకి ఇస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు తెలిపారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి టీఎంసీ పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. గోవా, త్రిపురలో టీఎంసీ విభాగాలను ఏర్పాటు చేశామని, రాబోయే రెండేళ్లలో పశ్చిమబెంగాల్‌లో తమ పార్టీని పటిష్టం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని, తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ మొత్తం 42 సీట్లు గెలుచుకునేందుకు గట్టి కృషి చేస్తామని చెప్పారు.


''గోవా, త్రిపురలో టీఎంసీ పర్సంటేజ్ 20 శాతం వరకూ ఉంది. రాబోయే రెండేళ్లలో బెంగాల్‌లో పార్టీని మరింత పటిష్టం చేసి 42 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడం ద్వారా బీజేపీని తరిమికొడతాం'' అని మమత పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రాంతీయపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆమె కోరారు. అన్ని పార్టీలను ఐక్యం చేసి, పోరాటం చేయడం ద్వారా 2024లో బీజేపీని ఓడించాలని తాను కోరుకుంటున్నట్టు చె్పపారు.


టీఎంసీ చైర్‌పర్సన్‌గా మళ్లీ మమత ఎన్నిక

కాగా, టీఎంసీ చైర్‌పర్సన్‌గా మళ్లీ మమతా బెనర్జీ ఎన్నికైనట్టు పార్టీ కార్యాలయ అధికారి ఒకరు బుధవారంనాడు తెలిపారు. ఐదేళ్ల తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికలను తృణమూల్ కాంగ్రెస్ నిర్వహిస్తోంది. టీఎంసీ చైర్‌పర్సన్‌గా ఎలాంటి పోటీ లేకుండా మమతాబెనర్జీ ఎన్నికైనట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ తెలిపారు. మమతా బెనర్జీ పేరును 48 మంది ప్రతిపాదించగా, ఇతరులు దానిని సమర్ధించారని, చైర్‌పర్సన్ అభ్యర్థిగా వేరెవరూ పోటీలో లేనందున మమతా బెనర్జీ ఎన్నిక ఏకగ్రీవమైందని పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కూడా ఉన్న ఛటర్జీ చెప్పారు. మమతాబెనర్జీ కాంగ్రెస్‌ నుంచి వేరుపడిన తరువాత 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

Updated Date - 2022-02-02T22:44:00+05:30 IST