Maharastra political crisis: రెబల్ ఎమ్మెల్యేల హోటల్ వద్ద TMC ఎమ్మెల్యేల ఆందోళన.. మాతో 20 మంది టచ్‌లో ఉన్నారు: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2022-06-23T17:24:11+05:30 IST

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అనూహ్యంగా రంగప్రవేశం చేసింది.

Maharastra political crisis: రెబల్ ఎమ్మెల్యేల హోటల్ వద్ద TMC ఎమ్మెల్యేల ఆందోళన.. మాతో 20 మంది టచ్‌లో ఉన్నారు: సంజయ్ రౌత్

ముంబై : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra Political Crisi) నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్(Trinamool congress) అనూహ్యంగా రంగప్రవేశం చేసింది. గువహటిలో శివసేన(Shivasena) రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న ‘రాడీసన్ బ్లూ(Radison blue)’ హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది. హోటల్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ(BJP) కొనుగోలు చేసిందంటూ నినాదాలు చేస్తున్నారు. అసోం(Assam) రాష్ట్రం వరదల్లో(Floods) చిక్కుకున్న వేళ బీజేపీ రాజకీయాల్లో మునిగిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రెబల్ ఎమ్మెల్యేలు బసచేస్తున్న ‘రాడీసన్ బ్లూ’ హోటల్‌ను అసోం బీజేపీ మంత్రి అశోక్ సింఘాల్ సందర్శించారు. అక్కడి వసతి సౌకర్యాలను పర్యవేక్షించారని పలు రిపోర్టులు వెలువడుతున్న నేపథ్యంలో తృణమూల్ నిరసనలు మొదలయ్యాయి.


20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు : సంజయ్ రౌత్

ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతన అంచున నిలబడిన వేళ శివసేన అగ్రనేత సంజయ్ రౌత్(Sanjay Rout) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శివసేన ఇంకా బలంగానే ఉందన్నారు. రెబల్ ఎమ్మెల్యేల్లోని 20 మంది తమతో టచ్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు. ‘వారంతా(రెబల్ ఎమ్మెల్యేలు) ముంబై వస్తే ఎవరు మాతో ఉన్నారో తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలంతా ఏయే పరిస్థితులు, ఒత్తిళ్ల మధ్య మమ్మల్ని వీడారో త్వరలోనే చెబుతా’ అని సంజయ్ రౌత్ అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకి నిజమైన భక్తులు కాదని మండిపడ్డారు.


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)ని బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసి శివసేన ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చిందని రౌత్ ఆరోపించారు. ఈడీకి భయపడి పారిపోయిన ఎమ్మెల్యేలు నిజమైన బాల్‌థాక్రే అనుచరులు కాదన్నారు. మిగిలినవారమే నిజమైన భక్తులమన్నారు. తమకు కూడా ఈడీ ఒత్తిళ్లు ఉన్నాయి. అయినా శివసేనను వీడబోమని చెప్పారు. ఫ్లోర్ టెస్ట్ ఏర్పాటు చేస్తే ఎవరికి సానుకూలత, ఎవరికి ప్రతికూల అనే విషయాలు తెలుస్తాయని సంజయ్ రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Read more