చెరువులో మునిగి నవదంపతుల సహా ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2022-10-17T16:35:14+05:30 IST
తేని జిల్లా బోడి సమీపంలో వివాహ విందు కోసం మేనమామ ఇంటికి వచ్చిన నూతన దంపతులు సహా ముగ్గురు చెరువులో స్నానాలకు వెళ్లి మృతి
చెన్నై/ప్యారీస్: తేని జిల్లా బోడి సమీపంలో వివాహ విందు కోసం మేనమామ ఇంటికి వచ్చిన నూతన దంపతులు సహా ముగ్గురు చెరువులో స్నానాలకు వెళ్లి మృతిచెందిన సంఘటన విషాదానికి దారితీసింది. బోడికి చెందిన మాజీ సైనికుడు కుమారుడు సంజయ్ (24) లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన మేనమామ తేనికి చెందిన రాజాకు గత నెల రోజుల క్రితం కోయంబత్తూర్‌కు చెందిన కావ్యతో వివాహం జరిగింది. వివాహానికి హాజరుకాలేకపోయిన సంజయ్ ఇటీవల మేనమామ ఇంట్లో జరిగిన విందులో పాల్గొనేందుకు లండన్ నుంచి వచ్చారు. ఆదివారం ఉదయం బోడి సమీపంలోని కొంబై చెరువులో స్నానం చేసేందుకు నూతన దంపతులు, పిన్ని కుమారుడు ప్రణవ్, సంజయ్ వెళ్లారు. వారు మెట్లు దిగుతూ జారి నీటిలో మునిగిపోయారు. ఈ దుర్ఘటనలో చిన్నారి ప్రణవ్ స్వల్పగాయాలతో బయటపడగా, మిగతా ముగ్గురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతంలో గాలించి ముగ్గురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. వివాహం జరిగిన నెలరోజులే గడచిన నూతన దంపతులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.