EC : ‘ఈ’ సాఫ్ట్‌వేర్‌ డేంజర్‌

ABN , First Publish Date - 2022-12-15T03:15:32+05:30 IST

ఆధార్‌ను ఓటర్‌ రికార్డులతో అనుసంధానం చేసేందుకు ఎన్నికల కమిషన్‌ ఒక గుర్తుతెలియని సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ల సమాచారాన్ని కులాలు,

EC : ‘ఈ’ సాఫ్ట్‌వేర్‌ డేంజర్‌

ఈసీ సాఫ్ట్‌వేర్‌తో ఓటర్ల సమాచారానికి ముప్పు

ఓటర్లను కులమతాల వారీగా గుర్తిస్తుంది

ప్రభుత్వాలు వారి వివరాలను కొల్లగొట్టే చాన్స్‌

ఈసీ సాఫ్ట్‌వేర్‌పై సుప్రీంలో తెలుగు టెకీ వ్యాజ్యం

దీంతోనే తెలంగాణ, ఏపీల్లో 46 లక్షల పేర్లను

ఓటర్ల జాబితా నుంచి తొలగించారని వెల్లడి

ఈసీతో పాటు ఇరు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆధార్‌ను ఓటర్‌ రికార్డులతో అనుసంధానం చేసేందుకు ఎన్నికల కమిషన్‌ ఒక గుర్తుతెలియని సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ల సమాచారాన్ని కులాలు, మతాలు, ప్రాంతం, భాష, ఆదాయం, వైద్య చరిత్ర ఆధారంగా కొల్లగొట్టే ప్రమాదం ఉందంటూ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు కొడాలి శ్రీనివాస్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఇది చాలా ముఖ్యమైన అంశం అని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ)తో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది గౌతం భాటియా కోర్టుకు వివరాలను అందజేశారు. ఓటర్‌ రికార్డులు పొందేందుకు ఈసీ రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతినిచ్చిందని వాదించారు. ఈసీ నిఘా సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఓటర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం ఆధారంగా.. వారిని వేర్వేరు వర్గాలుగా డేటాను విభజించవచ్చని వివరించారు. ‘‘అనుకూల, ప్రతికూల వర్గీయులను విభజించడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుంది. దీనివల్ల స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుపడదు.

ప్రత్యేక చట్టం లేకున్నా.. ఏ ప్రయోజనం లేకున్నా.. ప్రభుత్వాలు ఓటర్ల జాబితాను తమ ప్రయోజనాలకు అనుగుణంగా పరిశీలించవచ్చు. ఈ విషయంలో ఈసీ భారత రాజ్యాంగంలోని 324వ అధికరణ, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని విస్మరించింది’’ అని వ్యాఖ్యానించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఓటరు జాబితా ప్రక్షాళన పేరిట 2015లో 46 లక్షల మంది పేర్లు తొలగించారని భాటియా ఆరోపించారు. దీని వల్ల తాము బతికే ఉన్నామని ఓటర్లు నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. ఈసీ గతంలో వాదనలు వినిపిస్తూ తమ సాఫ్ట్‌వేర్‌ ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు డేటాబే్‌సను నిర్వహించే వ్యవస్థ మాత్రమేనని వివరించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ ఓటర్లను తొలగించలేదని, దానంతట అదే నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడం, చేర్చడం వంటి అధికారాలు కేవలం రిటర్నింగ్‌ అధికారులకే ఉంటాయని వెల్లడించింది. ఈ చర్యల వల్ల ఓటర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లబోదని ఈసీ హామీ ఇవ్వడం లేదని కొడాలి శ్రీనివాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్‌ గతంలోనే తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఓటర్‌ జాబితాలో పేరులేని వాళ్లు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన హైకోర్టు.. ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. 2018 డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే హైకోర్టులో పిల్‌ దాఖలు చేశామని, లక్షల సంఖ్యలో పేర్లను ఓటర్ల జాబిత నుంచి తొలగించడం వల్ల వారు ఓటు వేసే అవకాశం కోల్పోతారని పేర్కొన్నట్టు ఎస్‌ఎల్‌పీలో తెలిపారు. అయితే మూడేళ్ల తర్వాత 2021లో పిల్‌ను కొట్టివేసిందని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-15T03:15:34+05:30 IST