పుతిన్ హత్యకు అమెరికన్ సెనేటర్ పిలుపు

ABN , First Publish Date - 2022-03-04T18:51:52+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్

పుతిన్ హత్యకు అమెరికన్ సెనేటర్ పిలుపు

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ను హత్య చేయాలని అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పిలుపునిచ్చారు. రష్యా సైన్యంలో బ్రూటస్  కానీ, అత్యంత విజయవంతమైన కల్నల్ స్టౌఫ్ఫెన్‌బర్గ్ కానీ ఉన్నారా? అని అడిగారు. పుతిన్‌ను చంపడం ప్రపంచానికి గొప్ప సేవ చేయడమవుతుందన్నారు.


అమెరికన్ మీడియాతో లిండ్సే మాట్లాడుతూ, ఈ యుద్ధం ఎలా ముగుస్తుందని ప్రశ్నించారు. రష్యాలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి, ఆయనను (పుతిన్‌ను) అంతమొందించాలన్నారు.  లిండ్సే  ఇదే విషయాన్ని వరుస ట్వీట్లలో కూడా పునరుద్ఘాటించారు. దీనిని సరి చేయగలిగినవారు కేవలం రష్యన్లు మాత్రమేనని తెలిపారు. రష్యాలో బ్రూటస్ ఉన్నాడా? అంటూ, రోమన్ పాలకుడు జూలియస్ సీజర్‌ను బ్రూటస్‌ హత్య చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అదే విధంగా జర్మన్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ స్టౌఫ్ఫెన్‌బర్గ్ 1944 జూలై 20న అడాల్ఫ్ హిట్లర్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని  గుర్తు చేస్తూ, రష్యాలో స్టౌఫ్ఫెన్‌బర్గ్ ఉన్నారా? అని ప్రశ్నించారు. పుతిన్‌ను చంపడం రష్యాకు, ప్రపంచానికి గొప్ప సేవ చేయడమవుతుందన్నారు.  లిండ్సే దాదాపు 20 ఏళ్ళపాటు కాంగ్రెస్‌లో సేవలందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. జపొరిజ్య న్యూక్లియర్ పవర్ ప్లాంటుపై రష్యా దాడి చేసింది. ఈ ప్లాంట్‌లో మంటలను ఆర్పేసినట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ శుక్రవారం తెలిపింది. 


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కాసేపట్లో కోరనున్నట్లు  బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని జపొరిజ్య న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడిని ఈ అత్యవసర సమావేశంలో ప్రస్తావిస్తామని తెలిపింది. 


ఉక్రెయిన్‌కు భారత ప్రభుత్వం మానవతావాద సాయాన్ని పంపించింది. దాదాపు 6 టన్నుల బరువుగల ఆహార పదార్థాలు, మందులు వంటివాటితో హిందోన్ ఎయిర్ బేస్ నుంచి శుక్రవారం ఉదయం 4.05 గంటలకు బయల్దేరింది. ఈ విమానం రొమేనియాలో దిగుతుంది. అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు ఈ సాయాన్ని పంపిస్తారు. 


వెకేషన్ రెంటల్స్, టూరిజం కార్యకలాపాలను నిర్వహించే Airbnb రష్యా, బెలారస్‌లలో అన్ని కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. 


Read more