అంటే.. భూమికి తొందరెక్కువైంది!

ABN , First Publish Date - 2022-08-02T08:54:17+05:30 IST

: భూమి తన చుట్టూ తాను 24 గంటల్లో తిరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ..

అంటే.. భూమికి తొందరెక్కువైంది!

జూన్‌ 29న 1.59 మిల్లీసెకన్ల ముందే భ్రమణాన్ని పూర్తి చేసేసిన భూమి

ఆ విషయాన్ని గుర్తించిన పరమాణు గడియారం

2020 జూలై 19న 1.47 మిల్లీసెకన్ల ముందు పూర్తి

ఇలాగే కొనసాగితే నెగెటివ్‌ లీప్‌ సెకను జోడించాలి

దానివల్ల కంప్యూటర్‌ ప్రోగ్రాములు క్రాషయ్యే ముప్పు


వాషింగ్టన్‌, ఆగస్టు 1: భూమి తన చుట్టూ తాను 24 గంటల్లో తిరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. జూన్‌ 29న భూమి ఇంకొంచెం వేగంగా తిరిగి 24 గంటలకు 1.59 మిల్లీసెకన్ల ముందే భ్రమణాన్ని పూర్తిచేసేసిందట! భూభ్రమణ వేగాన్ని కొలవడానికి ఏర్పాటు చేసిన పరమాణు గడియారం ఈ విషయాన్ని గుర్తించింది. భూమి నాభి గుండా ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక రేఖను ఊహించుకోండి. దాన్ని ‘భూ అక్షం’ అంటారు. అది ఇరవైమూడున్నర డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఆ అక్షం ఆధారంగా భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగితే దాన్ని భూభ్రమణం అంటారు. ఇందుకు 24 గంటలు పడుతుంది. అయితే.. కొంతకాలంగా భూభ్రమణ వేగం పెరుగుతోందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భూమి ఇలా వేగంగా తిరుగుతోందని వారు చెప్పడం, అణు గడియారం గుర్తించడం ఇదే మొదటిసారి కాదు.


2020 జూలై 19న కూడా 1.47 మిల్లీ సెకన్లు వేగంగా తిరిగింది. ఎందుకిలా అంటే.. భూభ్రమణ వేగం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి.. సముద్రాలు, అలలు, భూమి లోపలి, బయటి పొరల్లో జరిగే మార్పులు, పర్యావరణ మార్పులు. అయితే, ఇలా మిల్లీసెకన్లయినా సరే తేడా రావడానికి, భూమి వేగంగా తిరగడానికి కారణం.. ‘చాండ్లర్‌ ఓబుల్‌’ అనే కదలికేనని నాసా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సముద్ర మట్ట పీడనాల్లో అస్థిరతలు, సముద్ర ఉష్ణోగ్రతలు, లవణీయతలో మార్పులు వీటన్నింటి వల్ల సముద్ర ప్రవాహాల్లో మార్పులు వస్తాయి. దీనివల్ల భూ అక్షంలో స్వల్పాతిస్వల్పంగా మార్పులు వచ్చి.. భూభ్రమణ వేగం పెరిగిపోతుంది.


ఇప్పుడేం జరుగుతుంది?

భూభ్రమణ వేగం ఇలా ఒకసారి పెరిగితే ఏమీ కాకపోవచ్చు. కానీ.. తరచుగా ఇలాగే జరుగుతుంటే? 24 గంటల్లోపే భ్రమణం ముగుస్తుంటే? అప్పుడు ఏమవుతుంది? అంటే.. ఏముంది కాలానికి ఒక నెగెటివ్‌ లీప్‌ సెకను జోడించాల్సి వస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంటే.. అర్ధరాత్రి 23:59:59 సెకన్ల తర్వాత 00:00:00కు బదులు 23:59:60 వస్తుంది. ఆ తర్వాత 00:00:00తో కొత్త రోజు మొదలవుతుంది. కానీ, అలా జోడించడం వల్ల సమస్య పరిష్కారం కాదు సరికదా.. మరికొన్ని కొత్త సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, నెగెటివ్‌ లీప్‌ సెకను జోడించడం వల్ల కంప్యూటర్‌ ప్రోగ్రాములు క్రాష్‌ అయిపోతాయని, టైమ్‌ స్టాంపులు మారిపోవడం వల్ల డేటా కరప్ట్‌ అయిపోతుందని మెటా(ఫే్‌సబుక్‌ మాతృసంస్థ) వంటి సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.


చాండ్లర్‌ ఓబుల్‌ అంటే?

భూభ్రమణ వేగం పెరగడానికి కారణం చాండ్లర్‌ ఓబుల్‌ అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇంతకీ చాండ్లర్‌ ఓబుల్‌ అంటే ఏమిటి? ఓబుల్‌ అంటే.. తూలడం లేదా అస్థిర స్థితి అని అర్థం. భూమి అక్షంలో ఎంతో కొంత తేడా వస్తోందనే విషయాన్ని అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త సేత్‌ కార్లో చాండ్లర్‌ గుర్తించారు. అందుకే దీన్ని ఆయన పేరిట ‘చాండ్లర్‌ ఓబుల్‌’గా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-08-02T08:54:17+05:30 IST