శాకాహార మొసలి కన్నుమూత

ABN , First Publish Date - 2022-10-11T09:09:28+05:30 IST

కేరళలోని కాసర్‌గాడ్‌ జిల్లా అనంతపురలో కొలువైన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ కొలనులో ‘శాకాహార’ మొసలి మరణించింది.

శాకాహార మొసలి కన్నుమూత

70 ఏళ్లుగా అనంతపద్మనాభస్వామి 

ఆలయ కొలనులోనే జీవనం

అన్నం.. బెల్లం ప్రసాదం మాత్రమే ఆహారం

విష్ణుమూర్తి సొంత మొసలిగా భక్తుల విశ్వాసం

ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ‘బాబియా’

ఆఖరి దర్శనానికి పోటెత్తిన భక్త జనం


కాసర్‌గాడ్‌, అక్టోబరు 10: కేరళలోని కాసర్‌గాడ్‌ జిల్లా అనంతపురలో కొలువైన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ కొలనులో ‘శాకాహార’ మొసలి మరణించింది. తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయానికి మూలస్థానంగా చెప్పే అనంతపుర ఆలయ పుష్కరిణిలో ఉన్న ఈ మొసలికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విష్ణుమూర్తి సొంత మొసలిగా భావించి భక్తులు నిత్యం దర్శించుకుంటారు. ‘బాబియా’ అని భక్తులు పిలిచే ఈ మొసలి పూర్తిగా శాకాహారి. ఓ మొసలి శాకాహారం తీసుకోవడం అనేది ప్రత్యేకం. బాబియా కేవలం భక్తులు పెట్టే ప్రసాదాన్ని మాత్రమే తింటుంది. ఆలయంలో అన్నం, బెల్లంతో తయారు చేసిన దేవుడి ప్రసాదమే ఆహారంగా తీసుకుంటుంది. ఎవరికీ ఏ హాని తలపెట్టని బాబియా సుమారు 70 ఏళ్లుగా ఆ కొలనులో ఒంటరిగానే ఉంటోంది.


ఈ ఆలయానికి సమీపంలో నది, సరస్సులు వంటివి ఏవీ లేవు. కానీ, ఈ మొసలి ఆ కొలనులోకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఇదొక్కటే కాదు ఆ ఆలయ చరిత్ర తెలిసిన వృద్ధులు చెప్పిన వివరాల ప్రకారం బాబియా ఆ కొలనులో మూడో మొసలి. ఒక మొసలి మరణించాక, మరో మొసలి పుష్కరిణిలో ప్రత్యక్షమవుతుంది. ఇది క్రమం తప్పకుండా జరుగుతుందని ఆలయ వెబ్‌సైట్లో కూడా వివరించారు. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న మొసలి శనివారం నుంచి కనిపించలేదని ఆలయ అధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాబియా కళేబరం కొలనులో తేలుతూ కనిపించింది. పోలీసులు, పశుసంవర్థకశాఖ అధికారుల సమక్షంలో దానిని బయటకు తీసి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు మొసలి ఆఖరి దర్శనానికి తరలివచ్చారు. ‘‘బాబియో విష్ణు పాదాల చెంతకు చేరుకుంది. 70 ఏళ్లుగా ఆలయాన్ని కాపాడింది. సద్గతి ప్రాప్తించాలి’ అని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే ట్వీట్‌ చేశారు. అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో మొసలి భగవంతుని ప్రతిరూపం అంటూ బీజేపీ కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 

Updated Date - 2022-10-11T09:09:28+05:30 IST