ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఇక తిరుగులేదు

ABN , First Publish Date - 2022-07-28T07:52:52+05:30 IST

రాజకీయ కక్షసాధింపుల కోసం మోదీ సర్కారు చేతిలో పదునైన అస్త్రంగా మారుతోందని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో..

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఇక తిరుగులేదు

మనీలాండరింగ్‌ చట్టం రాజ్యాంగబద్ధమే.. ఈడీకి అరెస్టు అధికారం ఉంది


నిందితులకు ప్రతిసారి ఈసీఐఆర్‌ ఇవ్వక్కర్లేదు

ఈ చట్టంలోని సెక్షన్లలో ఉల్లంఘనలు లేవు

545 పేజీల తీర్పులో స్పష్టం చేసిన సుప్రీం

పీఎంఎల్‌ఏపై 200కుపైగా పిటిషన్లు

ఆర్థిక వ్యవస్థ పాలిట పెనుముప్పు 

మనీలాండరింగ్‌ అని వ్యాఖ్య

ద్రవ్యవినిమయ బిల్లుపై 

అభ్యంతరాలు విస్తృత ధర్మాసనానికి..

జస్టిస్‌ ఖాన్విల్కర్‌ ధర్మాసనం స్పష్టీకరణ


న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాజకీయ కక్షసాధింపుల కోసం మోదీ సర్కారు చేతిలో పదునైన అస్త్రంగా మారుతోందని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో.. మనీలాండరింగ్‌ చట్టంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఈ చట్టానికి సంబంధించి అనేక కఠిన నిబంధనలతోపాటు ఈడీ అధికారులకు కల్పిస్తున్న పలు విశేష అధికారాలను సవాల్‌ చేస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లలోని వాదనలను, విమర్శలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. చట్టంలో పొందుపర్చిన నిబంధనలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ఽధర్మాసనం విస్పష్టంగా పేర్కొంది. మనీలాండరింగ్‌ అనేది తీవ్రమైన నేరమనీ.. ఆర్థిక వ్యవస్థ పాలిట అది పెనుముప్పు అని స్పష్టంచేసింది. అందుకే.. పీఎంఎల్‌ఏ చట్టంలోని ఉన్న కఠిన ప్రొవిజన్లన్నీ సమర్థనీయమైనవేనని తేల్చిచెప్పింది. ఈ చట్టంలో ఎక్కడా ఏకపక్ష వైఖరి లేదని వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద ఈడీకి దఖలు పడుతున్న అరెస్టుచేసే అధికారాలతో సహా కేసుల దర్యాప్తు, విచారణ, ఆస్తుల స్వాధీనం వంటి చర్యలన్నీ రాజ్యాంగబద్ధమైనవేనని  స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఇచ్చిన 545 పేజీల తీర్పును బీజేపీ చరిత్రాత్మకమని కొనియాడగా..


కాంగ్రెస్‌ మాత్రం ప్రజాస్వామ్యాన్ని చిక్కులో పడేసే అంశమని విమర్శించింది. ‘రాజకీయ కక్ష సాధింపు’లకు ఈ చట్టాన్ని ప్రయోగించే ప్రమాదం సుప్రీం తీర్పుతో మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)-2002ను.. ఆ చట్టంలోని పలు ప్రొవిజన్లు, సెక్షన్లను సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు, పార్టీ సీనియర్‌నేత రాహుల్‌గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారు డు కార్తీ చిదంబరం, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ తదితరులున్నారు. ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ కింద చర్య లు తీసుకునేప్పుడు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీఆర్పీసీ)ని పాటించాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరారు. ‘‘పీఎంఎల్‌ఏ కింద ఈడీకి ఉన్న అరెస్టు అధికారాలు, బెయిల్‌ మంజూరు, ఆస్తుల స్వాధీనం సీఆర్పీసీకి వెలుపలే ఉన్నాయి. అయితే, ఈడీ అధికారులు పూర్తిగా పోలీసుల్లాగే వ్యవహరిస్తున్నందున దర్యాప్తు సమయంలో సీఆర్పీసీని పాటించాలి. దర్యా ప్తు సమయంలో నిందితులు సమర్పించే వాంగ్మూలాలను వారికి బెయిల్‌ను వ్యతిరేకించడానికి సాక్ష్యాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని 22వ అధికరణకు విరుద్ధం. ఇది నిందితుడి రాజ్యాంగబద్ధమైన హక్కులను హరించడమే. దర్యాప్తును ప్రారంభించడం, నిందితుడు లేదా సాక్ష్యులను విచారించడానికి సమన్లు పంపడం, వారి స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేయడం, ఆస్తుల స్వాధీనం కోసం ఈడీ అనుసరిస్తున్న విధానాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. 20(3), 21వ అధికరణలు కల్పించే హక్కులను హరిస్తున్నాయి’’ అని వివరించారు.


పీఎంఎల్‌ఏ కేసుల్లో గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష ఉన్నప్పటికీ మిగతా కేసుల్లా బెయిల్‌ పొందడం అంత సులభంగా లేదని వివరించారు.(ఏడేళ్లలోపు శిక్షపడే నేరాల విషయంలో స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి). బెయి ల్‌ నిబంధనలు, షరతులు కఠినంగా ఉన్నాయన్నారు. 

ఈ వాదనలను ధర్మాసనం అంశాల వారీగా తోసిపుచ్చుతూ తన సుదీర్ఘ తీర్పులో స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘‘మనీలాండరింగ్‌ అనేది ఆర్థిక వ్యవస్థ పాలిట పెనుముప్పు. అది సాధారణ నేరం కాదు’’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం కూడా మనీలాండరింగ్‌తో జాతీయ భద్రత పాలిట ప్రమాదం గా ఉన్న వ్యక్తులు, ఉగ్రవాదులకు లింకులున్నట్లు పేర్కొంటు న్న విషయాన్ని గుర్తుచేసింది. పీఎంఎల్‌ఏ చట్టంలోని కఠిన ప్రొవిజన్లన్నీ సమర్థనీయమైనవేనని స్పష్టం చేసింది. ఈ కేసు ల్లో ఈడీ అధికారులకు సోదాలు నిర్వహించడం, అరెస్టులు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి అధికారాలు సమంజసమైనవేనని, ఎక్కడా రాజ్యాంగ విరుద్ధం కాదని వివరించింది. పీఎంఎల్‌ఏలో బెయిల్‌ షరతులను కూడా కోర్టు సమర్థించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) విషయంలో పిటిషనర్ల వాదనను తోసిపుచ్చుతూ పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు చేసే ఈడీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ), సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ అధికారులు పోలీసులు కాదని స్పష్టం చేసింది. ‘‘వీరంతా పోలీసులు కాదు.

అందువల్ల విచారణ సమయంలో వారు రికార్డు చేసే వాంగ్మూలాలను చట్టబద్ధమైన సాక్ష్యంగానే పరిగణించవ చ్చు(పోలీసులు నిందితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి వాంగ్మూలాలు సేకరిస్తారనే ఉద్దేశంతో ఆ వాంగ్మూలాలు చెల్లవని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసుల సాక్ష్యం కోర్టుల్లో చెల్లదు). ఈసీఐఆర్‌ అనేది పోలీసులు నమోదు చేసే ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఎ్‌ఫఐఆర్‌) కాదు. అందుకే ప్రతిసారి నిందితులకు ఈసీఐఆర్‌ ప్ర తులను అందజేయాల్సిన అవసరం లేదు. నిందితుల ను అరెస్టు చేసే సమయంలో ఫిర్యాదులో ఉన్న వివరాలు చెబితే సరిపోతుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద బెయిల్‌ విషయంలో ద్వంద్వ షరతుల నిబంధన సమంజసమైనదేనంటూ సమర్థించింది. ‘‘బెయిల్‌ విషయంలో పీఎంఎల్‌ఏ చట్టం ఏమాత్రం ఏకపక్షంగా వ్యవహరించడం లేదు. ఈసీఐఆర్‌.. ఎఫ్‌ఐఆర్‌ కాదు. దానికి సీఆర్పీసీ కింద విచారణ అవసరం లేదు’’ అని అభిప్రాయపడింది. 2002 కంటే ముందు జరిగిన నేరాలకు కూడా ఆ సంవత్సరంలో ఆమోదించిన మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసులు దాఖలు చేయడం సరైంది కాదంటూ పిటిషనర్లు చేసిన వాదనను కూడా ధర్మాసనం కొట్టివేసింది. ‘‘మనీలాండరింగ్‌ అనేది నిరంతరం కొనసాగే నేరం. 2002కు ముందు మనీలాండరింగ్‌ నేరం ద్వారా సంపాదించిన ఆస్తులను నిందితులు ఆ తర్వాత అనుభవిస్తునే ఉన్నారు’’ అని వ్యాఖ్యానించింది. పీఎంఎల్‌ఏ చట్టంలోని సవరణలు కొన్ని(బెయిల్‌ కోసం ద్వంద్వ షరతులు వంటివి) పార్లమెంట్‌ ఆమోదంతో జరగలేదని, ద్రవ్యవినిమయ బిల్లును కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ పిటిషనర్లు చేసిన వాదనలపై స్పందిస్తూ.. దీనిపై ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.


ట్రైబ్యునల్‌లో ఖాళీలను భర్తీ చేయండి
పీఎంఎల్‌ఏ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మనీలాండరింగ్‌ లాంటి సీరియస్‌ నేరాల విషయంలో అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ అవసరార్థులకు నిరంతరాయంగా సేవలందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌, స్వాధీనం, జప్తు విషయంలో బాధితులు/నిందితులు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది. 2019 సెప్టెంబరు 21 నుంచి ఈ ట్రైబ్యునల్‌కిచైర్మన్‌ లేకపోవడాన్ని తప్పుబట్టింది.


ఇది చరిత్రాత్మక తీర్పు: బీజేపీ
భారతీయ జనతాపార్టీ ఈ తీర్పును చరిత్రాత్మకమైనదని అభివర్ణించింది. ఈడీ దాడులపై విపక్షాల దుష్ప్రచారానికి ఇది చెంపపెట్టులాంటిదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సిందేనని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు, బీజేపీ అధికార ప్రతినిధులు గౌరవ్‌ భాటియా, నలిన్‌ కోహ్లీ ఈ తీర్పుపై స్పందిస్తూ.. ఇది విపక్షాలకు చెంపపెట్టువంటిదన్నారు.


పీఎంఎల్‌ఏలోని సెక్షన్ల వారీగా.. తీర్పులోని కీలకాంశాలు

 సెక్షన్‌ 45: ఈ సెక్షన్‌ విచారణార్హమైనది. ఇది నాన్‌ బెయిలబుల్‌. ఈ సెక్షన్‌ కింద బెయిల్‌ నిబంధనలు సహేతుకమైనవే. అవి ఏమాత్రం అసమంజసంగానీ, ఏకపక్షం గానీ కాదు.

 సెక్షన్‌ 19: ఈ సెక్షన్‌ కింద ఈడీకి దఖలు పడుతున్న అరెస్టు అధికారాలు రాజ్యాంగబద్ధమైనవే. ఇందులో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలేమి లేవు.

 సెక్షన్‌ 5: నిందితుల ఆస్తులను అటాచ్‌ చేయడానికి ఈడీకి ఈ సెక్షన్‌ అధికారాన్ని ఇస్తోంది. ఇది రాజ్యాంగబద్ధమైన సెక్షనే.

 సెక్షన్‌ 24: ఇది న్యాయబద్ధమైన సెక్షనే. దీని ప్రకారం నిందితుడు తాను నిర్దోషిని అని నిరూపించుకోవాల్సిందే. 

 సెక్షన్‌ 63: నేరం రుజువైతే విధించే శిక్షల గురించి వివరించే ఈ సెక్షన్‌లో ఎలాంటి అభ్యంతరాలు లేవు. దీని వల్ల రాజ్యాంగం ప్రసాదిస్తున్న జీవించే హక్కు(21వ అధికరణ) ఉల్లంఘన ఏమి లేదు.



చిక్కుల్లో ప్రజాస్వామ్యం: కాంగ్రెస్‌

డీ అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని చిక్కుల్లో పారేసేలా ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. ప్రభుత్వాలు రాజకీయ ప్రతీకారాలకు.. విపక్షాలపై ఈడీని ప్రయోగిస్తున్నాయని గుర్తుచేశారు. మోదీ సర్కారు ద్రవ్యబిల్లును దుర్వినియోగం చేస్తున్న తీరుపై తాను 2019లో సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. పీఎంఎల్‌ఏ చట్టంపైనా అభ్యంతరాలను వ్యక్తపరిచినట్లు తెలిపారు. ‘‘దీనిపై ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అయితే బుధవారం నాటి తీర్పులో సరైన సమాధానాలు రాలేదు. నేను లేవనెత్తిన అంశాలను విస్తృత ధర్మాసనానికి రిఫర్‌ చేసింది’’ అని పేర్కొన్నారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ కూడా తాను ఈ తీర్పుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఈ తీర్పు వల్ల.. అధికార పార్టీ ఈడీని రాజకీయ దుర్వినియోగం చేసుకోవడం మరింత తీవ్రమవుతుంది. దేశంలో నియంతృత్వ పోకడలు పెరిగాయి. ఇక ఈడీ వంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగం మరింత పెరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-28T07:52:52+05:30 IST